భర్త పోయి మూడేళ్లు: ఆస్తి కోసం ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌..

19 Jul, 2021 20:31 IST|Sakshi
కోడలి ఉదంతంపై వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

లక్నో: ఏడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన జీవితం. హఠాత్తుగా భర్త మరణించడంతో పిల్లలతో ఆమె ఒంటరైంది. అయితే భర్త మృతిచెందిన అనంతరం వేరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. కొన్నాళ్లకు ఆమె తన భర్తకు సంబంధించిన ఆస్తిపై కన్నుపడింది. న్యాయంగా అడగాల్సి ఉండగా.. అడగకుండా లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి మామను హతమార్చింది. కిరాయి హంతకులను మాట్లాడి మామను అంతమొందించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మావనా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తాటిన గ్రామానికి చెందిన సత్‌పాల్‌ కుమారుడు సంజీవ్‌కు పాలి గ్రామానికి చెందిన శాలినితో 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే 2018లో భర్త సంజీవ్‌ మరణించాడు. దీంతో భార్య శాలిని పుట్టింపటికి వచ్చేసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు విపిన్‌తో వివాహేతర సంబంధం కొనసాగింది. కొన్ని రోజులకు తన భర్తకు సంబంధించిన ఆస్తిపై మనసు పడింది. ఈ విషయమై మామ సత్‌పాల్‌తో వివాదం కొనసాగుతోంది. మామ నుంచి ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని ప్లాన్‌ వేసింది.

ఈ విషయాన్ని తన ప్రియుడు విపిన్‌కు చెప్పింది. మామ సత్‌పాల్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. సత్‌పాల్‌ను హతమార్చేందుకు ఓ కిరాయి ముఠాను సంప్రదించారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని కొంత ముందస్తుగా డబ్బులు చెల్లించారు. సత్‌పాల్‌ హత్యకు రెక్కీ నిర్వహించి ముహూర్తం కూడా నిర్ణయించారు. అందులో భాగంగా జూన్‌ 29వ తేదీన పొలం నుంచి తిరిగివస్తున్న సత్‌పాల్‌ను ముఠా వెంబడించి తుపాకీతో కాల్చి అతి దారుణంగా హతమార్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కోడలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సత్‌పాల్‌ హత్యకు శాలిని తండ్రి భోపాల్‌ సింగ్‌, సోదరుడు లలిత్‌ కూడా సహకరించారు. వీరితో పాటు ప్రియుడు విపిన్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే హంతక ముఠా ఆచూకీ మాత్రం లభించలేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరట్‌ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు 20 రోజుల వ్యవధిలో చేధించడం విశేషం.

మరిన్ని వార్తలు