విషాదం: విద్యార్థినితో భర్త పరారయ్యాడని

11 Sep, 2020 07:25 IST|Sakshi
ముత్తు, రాధ, పిల్లలు(ఫైల్‌)

సాక్షి, చెన్నై: కళాశాల విద్యార్థినితో భర్త పరార్‌ కావడంతో అవమాన భారంతో ఓ భార్య అగ్నికి ఆహుతైంది. ముందుగా ఇద్దరు మగబిడ్డలకు నొప్పి తెలియకూడదని నిద్ర మాత్రలు కలిపిన పాలను ఇచ్చి పడుకోబెట్టి, పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసింది. అరంతాంగిలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.  పోలీసుల కథనం మేరకు.... పుదుకోట్టై జిల్లా అరంతాంగి సమీపంలోని వల్లంబాక్కం కాడు గ్రామానికి చెందిన ముత్తు(45), రాధ(34) దంపతులకు అభిషేక్‌(13), అభిరుద్‌(9) పిల్లలు. తమకు ఉన్న పొలంలో పలురకాల పంటల్ని వేసుకుని, తద్వారా వచ్చే ఆదాయంతో ఆనందంగానే ముత్తు, రాధ కుటుంబ జీవన పయనం సాగుతూ వచ్చింది.

అయితే, ఇటీవల ముత్తు ధోరణిలో మార్పు వచ్చింది. కొన్ని నెలల క్రితం అరంతాంగిలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న రత్న కోట గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతితో ముత్తు కలిసి తిరుగుతున్నట్టు రాధ దృష్టికి చేరింది. భర్తను మందలించింది. పిల్లల జీవితం ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హిత బోధ చేసింది. అయితే, ముత్తులో మార్పు రాలేదు. ఆ విద్యార్థిని సైతం రాధ మందలించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముత్తు తిరిగి రాలేదు. ( కుమార్తెల ముందే అశ్లీలం.. భార్యపై డంబెల్‌తో దాడి)

కిడ్నాప్‌ కేసు...అవమానం.. 
ఆ విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్న ముత్తు విషయం బయటపడడంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆ విద్యార్థినితో పరార్‌ అయ్యాడు. సమాచారంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాధను ప్రశ్నించడమే కాకుండా, ముత్తుపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. భర్త చర్యలను అవమానంగా భావించిన రాధ, ఇక, తనువు చాలించేందుకు సిద్ధమైనట్టుంది. బుధవారం రాత్రి తన ఇద్దరు పిల్లలకు పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. వారు నిద్రకు ఉపక్రమించడంతో అర్ధరాత్రి వేళ ఆ ఇద్దరిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టింది. తాను కూడా పెట్రోల్‌ పోసుకుని ఆ మంటల్లో ఆహుతైంది. ఆ సమయంలో ఆమె పెట్టిన కేకలు విని ఇరుగుపొరుగు పరుగున వచ్చి మంటల్ని ఆర్పేందుకు శ్రమించారు.

అయితే, రాధ, అభిషేక్‌ల శరీరాలు పూర్తిగా కాలడంతో ఆహుతి అయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అభిరుద్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. అరంతాంగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. భర్త  విద్యార్థినితో పరార్‌ కావడంతో రాధ అవమానంగా భావించి మనోవేదనకు గురైనట్టు బంధువులు పేర్కొంటున్నారు. భర్త తిరిగి రాడని భావించే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు