చిట్టీల పేరుతో సొమ్ములు, అధిక వడ్డీలకు అప్పులు.. తీరా అడిగేసరికి..

30 Nov, 2021 07:31 IST|Sakshi

సాక్షి,ఏలూరు (పశ్చిమ గోదావరి): చిట్టీలు వేయగా సుమారు రూ.1.80 కోట్లకు శఠగోపం పెట్టి పరారైన నిర్వాహకులరాలు శ్రీరంగం సత్యదుర్గపై చర్యలు తీసుకుని, తమ సొమ్ము  ఇప్పించాలని ఏలూరు ఎంఆర్‌సీ కాలనీ, తంగెళ్లమూడి ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సత్యదుర్గ 50వ డివిజన్‌లో నివసిస్తూ ఆ ప్రాంత డ్వాక్రా సీఆర్పీగా పనిచేస్తుండేదని తెలిపారు.

లబ్ధిదారులకు అందాల్సిన సుమారు రూ.15 లక్షలు దారి మళ్ళించి ఆవిడ తన సొంతానికి వాడుకుని మోసం చేసిందన్నారు. దీనిని మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుళ్లగా ఆమె మోసం చేసినట్టు ధ్రువీకరించారని తెలిపారు. దీంతో అధికారులు సీఆర్పీని నిలదీయటంతో తిరిగి చెల్లిస్తానని ఆమె ఒప్పుకుని ఈ నెల 25న కుటుంబంతో సహా పరారైనట్టు చెప్పారు. దీనికి తోడు స్థానిక పరిచయాలతో చిట్టీల పేరుతో సొమ్ములు కట్టించుకుని, అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా పరారైనట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం అంతా కలిపి సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. తనకున్న రెండు భవనాలు, 75 గజాల స్థలం అమ్మి సొమ్ము ఇచ్చేస్తానని 6 నెలలుగా నమ్మిస్తూ వచ్చి ఆమె పరారైందని లబోదిబోమంటున్నారు.

చదవండి: సిటీకి కొత్త.. నమ్మి ఆటో ఎక్కితే ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు