విషాదం: అమ్మా.. ఎంత కష్టమొచ్చిందో..

10 Jun, 2021 08:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఆమెను ప్రాణం తీసుకునేలా చేశాయి. క్షణికావేశానికి లోనైన ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లలు దిక్కులేనివారు అవుతారని అనుకుందో ఏమో కడుపుతీపిని సైతం చంపుకొని వారినీ తనతో పాటే తీసుకెళ్లింది. ఆ చిన్నారులు అమ్మా వద్దు వద్దు అంటున్నా క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం తనతో పాటు ఇద్దరు చిన్నారులను విగతజీవులుగా మార్చింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం నగరంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మంలోని బస్టాండ్‌ సెంటర్‌లో పూల వ్యాపారం చేసే శ్రీనివాస్‌ తన మూడో కూతురైన వనితను బావమరిది డోన్‌వాన్‌ రవికుమార్‌కు ఇచ్చి 12 ఏళ్ల కిందట వివాహం చేశాడు. వారికి మొదట ఒక సంతానం కలిగి చనిపోగా తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు.

ఆటోడ్రైవర్‌ అయిన రవి కుటుంబంతో కలిసి ఖానాపురం యూపీహెచ్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు.  ఏడాదిన్నరగా వనిత నగరంలోని ఓ మార్ట్‌లో పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. అప్పుడప్పుడు రవికుమార్‌కు, వనితకు మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నా పెద్దవాళ్లు సర్దిచెప్పేవారు. తర్వాత భార్యాభర్తలు కూడా సర్దుకొని పోయి బాగానే ఉండేవారు. కొన్ని రోజుల క్రితం భర్తకు కరోనా రావడంతో వనిత పిల్లలు చైతన్య(7), రోహిణి(6)లతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రవికుమార్‌ మంగళవారం రాత్రి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో ఇద్దరు ఫోన్‌లో ఘర్షణపడ్డారని.. బుధవారం ఉదయం భర్త వద్దకు వెళ్లగా ఆమెకు, రవికుమార్‌కు మరలా గొడవ జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 

మున్నేరులో దూకి..
బుధవారం మార్ట్‌లో పనిచేయడానికి వెళ్లాల్సిన వనిత అక్కడకు వెళ్లకుండా ఇద్దరు పి  ల్లలను తీసుకొని ఆటోలో కాల్వొడ్డుకు చేరుకుంది. అక్కడ నుంచి మోతీనగర్‌ వైపు ఉన్న మున్నేరు ఒడ్డుకు వెళ్లింది. మొదట పిల్లలను మున్నేరు నీటిలో తోసేసి అనంతరం తాను కూడా దూకింది. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ముగ్గురిని కాపాడేందుకు నీళ్లలో దూకి వారిని ఒడ్డుకు చేర్చిచూడగా అప్పటికే ప్రాణాలు విడిచారు. ఏదైనా కష్టం ఉంటే తమకు చెప్పాల్సిందని, తామందరం లేమా అని ఆమె సోదరుడు కోటి, సోదరీమణులు, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.

ఆర్థిక ఒత్తిళ్లతోనే.. 
ఇదిలా ఉండగా వనిత, రవికుమార్‌ మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా అవి తాత్కాలికమేనని.. ఆమె భర్త కూడా భార్యను, పిల్లలను వదిలిపెట్టి ఉండేవాడు కాదని కొంతమంది బంధువులు చెబుతున్నారు. అయితే ఇటీవల వనిత ఒక స్కీమ్‌కు సంబంధించి తాను చేరడంతో పాటు మరికొందరిని కూడా చేర్పించిందని, దానికి సంబంధించిన డబ్బును స్కీమ్‌ నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ఆమెకు అవతలివారి నుంచి ఆర్థిక ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని కొంతమంది బంధువులు అంటున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీధర్‌ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను రెడ్‌క్రాస్‌ సొసైటీ శాశ్వత సభ్యుడు అన్నం శ్రీనివాసరావు తన బృంద సభ్యులతో కలిసి మార్చురీకి తరలించారు.  

చదవండి: బర్త్‌డే కేక్‌ కట్‌ చేశాడు.. అందరూ కటకటాల పాలయ్యారు

మరిన్ని వార్తలు