పిల్లలను భయపెట్టేందుకు.. నీళ్లలో హిట్‌ కలుపుకుని

4 Apr, 2021 11:27 IST|Sakshi

చిలకలగూడ: అల్లరి చేస్తున్న పిల్లలను భయపెట్టేందుకు నీటిలో పురుగుల మందు కలుపుకుని తాగింది. అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌గూడ ఏక్‌మినార్‌గల్లీకి చెందిన ఫర్హిన్‌బేగం (26), ఫిరోజ్‌లు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈనెల 1వ తేదీన పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుండడంతో అదుపు చేయడంతోపాటు వారిని భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న బొద్దింకల మందు (హిట్‌)ను నీళ్లలో కలుపుకుని తాగింది.

తల్లి పురుగుల మందు తాగిందని కుమారుడు సమీపంలో ఉన్న అమ్మమ్మకు చెప్పాడు. ఆమె వచ్చి అడగ్గా పిల్లలను భయపెట్టేందుకు కొంచెం పురుగుల మందు తాగానని చెప్పింది. కొంత సమయం తర్వాత అస్వస్థతకు గురికావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ ఫర్హిన్‌బేగం శనివారం మృతి చెందింది. తల్లి అస్మాసుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

విషాదం: తలనొప్పి భరించలేక
కంటోన్మెంట్‌: తలనొప్పి భరించలేక ఓ గర్భిణి చెట్ల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. బోయిన్‌పల్లి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి శ్రీనాథ్, స్వప్న (33) దంపతులు ఓల్డ్‌ బోయిన్‌పల్లి సాయికృష్ణ డ్రీమ్‌ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. వీరికి హరిణి (12), చేతన (6) ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న స్వప్న కొద్దిరోజులుగా తీవ్ర తలనొప్పితో బాధపడుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తలనొప్పి మరింత తీవ్రం కావడంతో ఇంట్లో చెట్ల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు