విషాదం: పెళ్లి బట్టలు కొనేందుకు వెళ్తూ..

8 Jul, 2021 07:56 IST|Sakshi

 సాక్షి,శ్రీకాకుళం రూరల్‌: మరికొద్ది రోజుల్లో పెళ్లి భజంత్రీలు మోగాల్సిన ఇంట.. చావు బాజా మోగింది. కుమార్తె వివాహానికి అవసరమైన దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తున్న దంపతుల ద్విచక్ర వాహనాన్ని వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం రూరల్‌ మండలం చల్లపే ట వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘోరంలో ఆమదాలవలస మండలం కలివరం గ్రామానికి చెందిన బరాటం నాగరత్నం (45) మృతి చెందగా.. ఆమె భర్త మల్లేషు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం..బరాటం మల్లేషు కుమా ర్తె సుప్రియకు ఆగస్టు రెండో తేదీన వివాహం నిశ్చయమైంది. దీంతో దుస్తులు, బంగారం ఇతర సామగ్రిని నరసన్నపేటలో కొనుగోలు చేసేందుకు భార్య నాగరత్నంతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.

ఎఫ్‌సీ గొడౌన్‌ దాటాక చల్లపేట గ్రామం వద్దకు రాగానే వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బొలేర్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనా న్ని 50 అడుగుల దూ రం ఈడ్చుకుంటూ వెళ్లిన వ్యాన్‌ విద్యుత్‌ స్తంభాన్ని కూడా ఢీకొట్టి ఆగింది. ఈ ఘోరంలో నాగర త్నం ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. భర్త మల్లేషు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రి కి తరలించారు. నాగరత్నం, మల్లేషు దంపతులకు కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నా రు. కలివరం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రూరల్‌ ఎస్‌ఐ రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం రిమ్స్‌కి తరలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు