నోట్లో గుడ్డకుక్కి.. బాలింతకు నరకం

26 Nov, 2020 08:34 IST|Sakshi

నోట్లో గుడ్డకుక్కి చితకబాదిన వైనం

బాలింత మామ ఓ ఏఎస్‌ఐ

అదనపు కట్నం, ఆడపిల్ల పుట్టిందని వేధింపులు

అనంతపురం : పచ్చి బాలింతకు అత్తింట్లో ప్రత్యక్ష నరకం చూపించారు. ఏడు రోజుల బాలింత అని చూడకుండా నోట్లో గుడ్డకుక్కి చితకబాదిన ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలోని నాయక్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి బాలింతను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి బాయికి ఆరేళ్ల క్రితం నగరంలోని నాయక్‌నగర్‌కు చెందిన జగన్‌మోహన్‌ నాయక్‌తో వివాహమైంది. ఇతను చెన్నై ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ క్వాలిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగన్నరేళ్ల పాప ఉంది. ఈ నెల 18న నగరంలోని స్నేహలత ఆస్పత్రిలో లక్ష్మిదేవి బాయి మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 22న లక్ష్మిబాయి డిశ్చార్జ్‌ కాగా, నాయక్‌నగర్‌లోని అత్తింటికి వెళ్లింది. అప్పటి నుంచి బాలింతకు ప్రత్యక్ష నరకం మొదలైంది.

మామ శంకర్‌నాయక్‌(ఏఎస్‌ఐ, పీటీసీ), అత్త శాంతిబాయి, భర్త జగన్‌మోహన్‌ నాయక్, మరిది పరమేష్‌నాయక్‌ విచక్షణారహితంగా చితకబాదారు. మరో కోడలు కట్నం కింద స్థలాలు తీసుకొచ్చిందని, నీవెమిచ్చావని నానా దుర్భాషలాడారు. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చావని కొట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం లక్ష్మిదేవిబాయిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల వారు, మీడియా విషయాన్ని టూటౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా బాలింతను స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు తీసుకొని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్తా, మామ, భర్త, మరిదిపై పోలీసులు కట్నం, వేధింపులు తదితర కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీదేవిబాయిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి పరామర్శించారు.

భార్యను కడతేర్చిన భర్త 
శింగనమల: అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. శింగనమల మండలం ఈస్ట్‌ నరసాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు....  ఈస్ట్‌ నరసాపురం గ్రామానికి చెందిన ఓబుళ నారాయణ, తన అక్క కుమార్తె తాడిపత్రికి చెందిన ఇందిరమ్మ (35)ను 22 సంవత్సరాలు క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, కూమారై ఉన్నారు. 12 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు. అయితే భార్యపై అనుమానంతో రోజూ వాదులాడుకునేవారు. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితమే భర్తను వదిలేసి ఇందిరమ్మ తాడిపత్రికి వెళ్లిపోయింది. ఇందిరమ్మ తన కుమారుడితో కలిసి తాడిపత్రిలో నివసిస్తుండగా.. ఓబుళ నారాయణ కుమార్తెను పోషిస్తూ ఈస్ట్‌ నరసాపురంలోనే ఉండేవాడు.

అయితే కుమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో ఓబుళ నారాయణ ఈ నెల 22న భార్య ఇందిరమ్మను ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. ఇందులో భాగంగా ఆవేశంతో ఓబుళ నారాయణ సుత్తి తీసుకొని భార్య ఇందిరమ్మ తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు  శింగనమల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఎస్‌ఐ మస్తాన్‌ సిబ్బందితో కలిసి ఈస్ట్‌ నరసాపురానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే ఇందిరమ్మ మృతి చెందినట్లు గుర్తించారు. ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌ కూడా ఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   

మరిన్ని వార్తలు