పోకిరీ మైనర్‌!

8 May, 2022 00:54 IST|Sakshi

మహిళను వేధిస్తున్న ఆకతాయిలు 

98 మంది మైనర్లకు కౌన్సెలింగ్‌ 

రెండు నెలల్లో 355 కేసులు నమోదు 

సాక్షి, సిటీబ్యూరో: ఈవ్‌ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్‌ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్‌ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్‌ షీ టీమ్స్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు.

గత రెండు నెలలో సైబరాబాద్‌ షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్‌ ద్వారా చేయగా.. ట్విటర్‌లో 8 మంది, హ్యాక్‌ ఐలో 7 మంది, ఈ–మెయిల్‌ ద్వారా 5 మంది, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ.

గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని 34 మంది, సోషల్‌ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్‌ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్‌లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్‌ 2 మంది మహిళా బాధితులున్నారు. 

7 బాల్య వివాహాలకు చెక్‌.. 
గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో 7 బాల్య వివాహాలను షీ టీమ్‌లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్‌ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్‌ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు.

మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్‌కు పంపించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్‌ ఆపరేషన్లలో 75 మంది రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ సేఫ్టీ వింగ్, సైబరాబాద్‌ షీ టీమ్‌ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్‌ ఇచ్చాయి. 

మరిన్ని వార్తలు