కొడుకును కొట్టి చంపింది

9 Jun, 2021 06:30 IST|Sakshi
ఉమేష్‌ మృతదేహం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..  

హైదరాబాద్‌లో దారుణం

జీడిమెట్ల: కడుపున పుట్టిన కొడుకును అక్రమ సంబంధానికి అడ్డుగా తలచింది ఓ కర్కశ తల్లి. ముక్కుపచ్చలారని కొడుకును చేతికందిన దాంతో విచక్షణారహితంగా కొట్టేది. ఆ దెబ్బలకు చిన్నారి తట్టుకోలేక విలవిల్లాడిపోయేవాడు. ‘అమ్మా.. నన్ను కొట్టద్దు అమ్మా’ అంటూ రోదిస్తున్నా.. ఆ తల్లి మనసు కరగలేదు. చివరికి  బాలుడు కన్నుమూశాడు. అమ్మతనానికి మచ్చ తెచ్చిన ఈ అమానుష ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు, బాలుడి తండ్రి కథనం ప్రకారం... సూరారం ప్రాంతానికి చెందిన సురేశ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. భార్య ఉదయ, కుమారుడు ఉమేష్‌(3)లతో కలిసి ఉండేవాడు. కుటుంబకలహాలతో ఉదయ ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటోంది.

చింతల్‌ డివిజన్‌ భగత్‌సింగ్‌ నగర్‌లో నివసిస్తున్న ఈమెకు భాస్కర్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ తరచూ ఉమేష్‌ను వేధించేవాళ్లు. ఉదయ అయితే తన భర్తపై ఉన్న కోపాన్ని కుమారుడిపై చూపించేది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కసితో బాలుడిని హింసించేది. మంగళవారం మధ్యాహ్నం కరెంట్‌ వైర్‌తో విచక్షణారహితంగా కొట్టింది.  ఆ దెబ్బలు తాళలేక కొద్దిసేపటికి ఉమేష్‌ సొమ్మసిల్లి, అచేతనంగా పడిపోయాడు. దీంతో సాయంత్రం 4 గంటలకు సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని కోరింది. పరీక్షించిన డ్యూటీ డాక్టర్‌ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానించిన ఆస్పత్రి సిబ్బంది జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఉదయ, భాస్కర్‌ల వివాహేతర సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడనే కొట్టి చంపారని సురేశ్‌ ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు