హైదరాబాద్‌లో విషాదం.. భర్తతో గొడవలు.. న్యాయవాది ఆత్మహత్య

18 Apr, 2022 17:07 IST|Sakshi

భవనం పైనుంచి దూకి జూనియర్‌ అడ్వకేట్‌ ఆత్మహత్య 

సాక్షి, హైదరాబాద్‌: భర్త, మేనమామ వేధింపులు భరించలేక ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ క్యాస్ట్రో తెలిపిన మేరకు.. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్‌ ఫేజ్‌ –1 ఢిపెన్స్‌ ఎంప్లాయిస్‌ కాలనీలో మల్లికార్జున్‌రెడ్డి, శివాణి(24) దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. శివాణి జూనియర్‌ అడ్వకేట్‌గా పనిచేస్తూ శేరిలింగంపల్లిలో స్టాంప్‌ వెండర్‌ ఆఫీస్‌ నిర్వహిస్తోంది. శనివారం రాత్రి మల్లికార్జున్‌రెడ్డి, శివాణి మేనమామ రఘు, శివాణిల మధ్య స్టాంప్‌ పేపర్ల విషయంలో గొడవ జరిగింది.

రాత్రి 11.30 గంటల సమయంలో గొడవ జరుగుతుండగా మనస్తాపం చెందిన శివాణి పక్కనే భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు. శివాణీ తల్లి హేమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మేనమామ రఘు, భర్త పె కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం మేనమామ స్టాంపు పేపర్లు తీసుకెళ్లడంతోపాటు శివాణిని చదివించిన డబ్బివ్వాలని అడుగుతున్నాడని, దీనికితోడు శివాణి తల్లి ఆస్తిలో భాగం కావాలని భర్త  వేధిస్తున్నాడని ఫిర్యాదులోపేర్కొన్నారు.  

తెల్లవారితే కుమారుడి పుట్టినరోజు.. 
శివాణీ మూడేళ్ల కుమారుడు అనిరుధ్‌ పుట్టిన రోజు ఆదివారం కావడంతో వేడుకలకు ఏర్పాటు పూర్తి చేశారు. శనివారం రాత్రి జరిగిన గొడవతో శివాణి ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు