ఎంత పని చేశావు తల్లీ?! 

20 Dec, 2020 11:01 IST|Sakshi

‘బంగారం’ లాంటి బిడ్డలు. ఎంతో భవిష్యత్‌ ఉన్న వారు. వారి గురించి ‘ఒక్క క్షణం’ ఆలోచించి ఉన్నా ఈ ఘోరం తప్పేదేమే! కానీ నీతో పాటు ‘ఆశా దీపాల’ను ఆర్పేసి అందరి నింద మోసుకెళ్లావు కదా తల్లీ?! కష్టాలు, కన్నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే జీవితం. ఎంతో విలువైన జీవితానికి ఇంత బేలగా ముగింపు పలకడం విషాదం. 

సాక్షి, కర్నులు : హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సవిత(35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు నిశ్చల కుమార్‌(12), వేంకటసాయి (7)ని ఉరి వేసి చంపి..తనూ ఆత్మహత్య చేసుకుంది. వేరు కాపురం పెట్టడానికి భర్త అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గూళ్యం గ్రామానికి చెందిన ప్రహ్లాద్‌ శెట్టి, సుభద్రమ్మలకు ఐదుగురు కుమారులు.

నాల్గవ కుమారుడైన సతీష్‌ గుప్తా కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సండూరు గ్రామానికి చెందిన కుమారస్వామి, నాగమణిల కుమార్తె సవితను 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి నిశ్చల కుమార్, వేంకటసాయి సంతానం. నిశ్చలకుమార్‌ ఆరోతరగతి, వేంకటసాయి ఒకటో తరగతి చదువుతున్నారు. కాగా.. సవిత, ఆమె భర్త, పిల్లలు ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటున్నారు. సవిత కొన్ని రోజుల నుంచి వేరే కాపురం పెట్టాలని భర్తతో చెబుతూ వచ్చింది. ఇందుకు అతను అంగీకరించలేదు. దీంతో ఆమె వారం క్రితం అలిగి పుట్టింటికి వెళ్లింది. అక్కడ తల్లి సర్దిచెప్పి శుక్రవారం గూళ్యం గ్రామానికి తిరిగి పంపించింది. అయితే అదే రోజు రాత్రి ఆమె వేరే కాపురం విషయమై  భర్తతో మరోసారి గొడవ పడింది.

అయినా అతను వినిపించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో బెడ్‌రూంలో తన పిల్లలకు ఉరి వేసి చంపి.. తరువాత తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలూరు సీఐ భాస్కర్, హాలహర్వి ఎస్‌ఐ నరేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించి.. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుతాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

వేధింపులే కారణమా? 
ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామస్తులు మాత్రం మరోవిధంగా చర్చించుకుంటున్నారు. వారం క్రితం ఇంట్లో పది తులాల బంగారం పోవడంతో దానికి కారణం నీవేనంటూ తోడి కోడళ్లు, బావలు, ఇతర కుటుంబ సభ్యులు సవితను వేధించినట్లు తెలుస్తోంది. ఇందుకు భర్త కూడా అడ్డు చెప్పలేదని సమాచారం. వేధింపులు భరించలేక వారం క్రితం పుట్టింటికి వెళ్లడం.. అక్కడ తల్లి సర్దిచెప్పి తిరిగి  పంపించడం, అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు మరోసారి దొంగిలించిన బంగారాన్ని తీసుకు రావాలని వేధించడంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు