అమ్మా.. సావొద్దే..

7 Dec, 2020 03:00 IST|Sakshi

కుమారుల ముందే ఉరేసుకొని తల్లి ఆత్మహత్య.. 

వద్దంటూ ఆర్తనాదాలు చేసిన చిన్నారులు

తన చావుకు ఎవరూ కారణం కాదంటూ మహిళ సెల్ఫీ వీడియో  

సాక్షి, హైదరాబాద్‌/అడ్డగుట్ట: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి కళ్ల ముందే ఆత్మహత్య చేసుకోవ డంతో ఆ చిన్నారులు అల్లాడిపోయారు.. గదిలో ఉరేసుకుంటున్న ఆమెను చివరి నిమిషంలో చూసిన ఇద్దరు పిల్లలు ‘అమ్మా.. వద్దు.. సావొద్దే..’అంటూ ప్రాధేయపడ్డారు. ఇటు తండ్రికి ఫోన్‌ చేయడానికి ప్రయత్నించినా కలవలేదు.. దీంతో వారి మేన మామకు ఫోన్‌ చేసి విషయం చెప్పగా.. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి వచ్చేలోపే ఘోరం జరిగిపోయింది.. ఉరికి వేలాడుతూ ఆమె విగతజీవిలా కనిపించింది. 

పన్నెండేళ్ల క్రితం వివాహం..
కర్ణాటకకు చెందిన సతీశ్, మంజుల గౌడలకు (32) పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. అనంతరం లాలాపేట ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఆరో తరగతి చదువుతున్న రంజిత్, ఐదో తరగతి చదువుతున్న తేజస్‌ సంతానం. సతీశ్‌ తన ఇంటికి సమీపంలోని లేబర్‌ అడ్డా ప్రాంతంలో బెంగళూర్‌ అయ్యంగార్‌ బేకరీ నిర్వహిస్తున్నాడు. మంజుల కూడా వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్లి భర్తకు సహాయం చేసేది. మంజుల సోదరుడు నాగరాజు సైతం హుజూరాబాద్‌లో బేకరీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటలకు సతీశ్‌ యథావిధిగా తన బేకరీకి వెళ్లిపోయాడు. 

కాసేపటివరకు మంజుల పిల్లలతోనే గడిపింది. ఏమైందో తెలియదు గానీ.. ఉదయం 10 గంటల ప్రాంతంలో మంజుల బెడ్రూంలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరేసుకుంది. హాలులో ఆడుకుంటున్న తేజస్, రంజిత్‌లు ఆఖరి నిమిషంలో కిటికిలోంచి ఈ విషయం గమనించారు. వద్దమ్మా.. వద్దు అంటూ రోదిస్తున్నా.. మంజుల మనసు మారలేదు. దీంతో ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో తేజస్‌ వద్దని వారిస్తుండగా.. రంజిత్‌ ఇంట్లోని ఫోన్‌తో బేకరీలో ఉన్న తండ్రికి కాల్‌ చేయడానికి ప్రయత్నించాడు. అది కలవకపోవడంతో మేనమామ నాగరాజుకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. దీంతో అతను బావ సతీశ్‌కు కాల్‌ చేసి ఆరా తీయగా.. తాను బేకరీలో ఉన్నానని, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నానంటూ పరుగుపెట్టాడు. సతీశ్‌ ఇంటికి చేరుకునేలోపే మంజుల ప్రాణం విడిచింది. అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

సెల్ఫీ వీడియో చిత్రీకరించి..
కళ్ల ముందే ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతదేహాన్ని చూస్తూ ఆ ఇద్దరు చిన్నారులు గుండెలు పగిలేలా రోదించారు. వారిని సముదాయించడం అక్కడున్న ఎవరి వల్ల కాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంజుల సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయే ముందు మంజుల ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఆమె తన చావుకు ఎవరూ కారణం కాదంటూ చెప్పింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివాసు ‘సాక్షి’కి తెలిపారు.

>
మరిన్ని వార్తలు