అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్‌?

19 Jun, 2021 06:53 IST|Sakshi

పోలీసు దెబ్బలు తాళలేక మహిళ మృతి 

ఆమె కుమారుడు, మరొకరికి తీవ్ర గాయాలు  

పత్తాలేని పోలీసులు

అడ్డగూడూరు: పోలీసు దెబ్బలు తాళలేక ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. పోలీసులు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికి లాకప్‌డెత్‌ అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన చర్చి ఫాదర్‌ బాలస్వామి ఇంట్లో ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేస్తోంది.

ఈ నెల 15న బాలస్వామి ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆయన అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే స్వగ్రామానికి వెళ్లిపోయిన మరియ, ఉదయ్‌ను పోలీసులు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారితో పాటు ఉదయ్‌ స్నేహితుడు శంకర్‌ వచ్చాడు. విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుండగా శంకర్‌ అడ్డుకునేందుకు యత్నించారు. అయితే.. అతన్ని కూడా వదలలేదు. దెబ్బలు తాళలేక మరియ స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆమెను మండలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులు ఆమెను వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. తీవ్రంగా గాయపడిన ఉదయ్, శంకర్‌ భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కాగా, కేసును నీరుగార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  

చదవండి: మంచిర్యాలలో తల్లీకూతుళ్ల హత్య

మరిన్ని వార్తలు