ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వని భర్త

12 Aug, 2021 11:11 IST|Sakshi
భర్త ఇంటి ముందు చిన్నపాపతో కూర్చున్న భార్య పార్వతి

సాక్షి,నర్సీపట్నం: ఆడపిల్ల పుట్టిందని భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. దీంతో చేసేది లేక  పార్వతి అనే మహిళ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద బొడ్డేపల్లిలోని తన అత్తవారి ఇంటి వద్ద  బుధవారం బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి  నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది.  రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పని చేస్తున్నాడు. పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నా కాపురానికి తీసుకురాకుండా అత్త, మామలు అడ్డుపడుతున్నారు.

ఆడపిల్లల పుట్టిందని,   తల్లిపేరు మీద ఉన్న  భూమి రాయించుకు రాలేదని  కాపురానికి  తీసుకురాలేదని పార్వతి తెలిపింది. నెల రోజుల్లో కాపురానికి తీసుకెళ్తానని రావికమతం పోలీసు స్టేషన్‌లో అంగీకరించిన భర్త ఆ తరువాత పట్టించుకోలేదని వాపోయింది. దీంతో మానసిక వేదనతో తన తల్లి  ఇటీవల మృతి చెందిందని,  తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో   తోబుట్టువు వద్ద తలదాచుకుంటున్నానని ఆమె చెప్పింది.

 బంధువులను వెంట పెట్టుకుని భర్త ఇంటికి వచ్చానని,  ఇంటి వద్ద ఉన్న అత్త, మామలు తనను లోపలికి రానివ్వకుండా తలుపులు  వేసుకుని బయటకు వెళ్లిపోయారని తెలిపింది. దీంతో  న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు బైఠాయించినట్టు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు, భర్త తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.      

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు