మంచినీళ్లు ఇవ్వమని అంతలోనే బంగారం కొట్టేసి.

11 Apr, 2021 13:46 IST|Sakshi

12 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ

సాక్షి, ఒంగోలు: అద్దె ఇంటికోసం వెతుకుతున్నామని, మీ ప్లాట్‌ ఎదురుగా ఉన్న ఇల్లు అద్దెకు తీసుకుందామని వచ్చామంటూ ముగ్గురు వ్యక్తులు మహిళను బంధించి 12 సవర్ల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. ఈ సంఘటన పెళ్లూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు యువకులు, 40 ఏళ్ల వయసున్న మహిళ పెళ్లూరులోని సాయి రిట్రీట్‌ అనే అపార్టుమెంట్‌ మూడో ఫ్లోర్‌లో 302 నంబర్‌ ప్లాట్‌లో నివాసముంటున్న శిఖాకొల్లి లక్ష్మీ తాయారు వద్దకు వచ్చి ఎదురింటి ప్లాట్‌ను అద్దెకు తీసుకోవాలని వచ్చామని, మంచినీళ్లు ఇవ్వరా అని కోరారు.

దీంతో ఆమె వంట ఇంట్లోకి వెళ్లగానే ముగ్గురు వ్యక్తులు హాల్లోకి వచ్చి మాటల్లో బెట్టి ఆమెను బెదిరించి శరీరంపై ఉన్న బంగారు గాజులు 4 (ఆరు సవర్లు), 5 సవర్ల బంగారు చైను, ఒక సవర కమ్మలు మొత్తం వెరసి 12 సవర్లు దోచుకున్నారు. అనంతరం ఆమెను హెచ్చరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే మహిళ భయపడి ఎవరికి చెప్పేందుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పి శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేశారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: టీడీపీ నేత దాష్టీకం: తన్ని.. మెడపట్టి గెంటి..

మరిన్ని వార్తలు