కలెక్టర్‌ అవుదామని కలలు కని.. రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకుని..

14 Jun, 2022 09:06 IST|Sakshi
సందీప్‌ చంద్ర(ఫైల్‌),సరళ(ఫైల్‌)

కేపీహెచ్‌బీకాలనీ: సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. జోగులాంబగద్వాల జిల్లాకు చెందిన గోగినేని వరప్రసాద్‌ భార్య సరళ(58), కుమారుడు సందీప్‌ చంద్ర(38)లతో కలిసి కేపీహెచ్‌బీ పరిధిలోని బృందావన్‌కాలనీలో గల రిషితాకల్యాణ్‌ అపార్టుమెంట్‌లోని 208 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు.

వ్యాపార రీత్యా రైస్‌ మిల్లులు నిర్వహిస్తున్న వరప్రసాద్‌ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అయితే మూడు రోజుల కిందట వరకు అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడిన సరళ, సందీప్‌ల ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడం, ఇంట్లోను నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌ను వెళ్లి చూడాలని కోరారు. దీంతో వారు సరళ, సందీప్‌లు ఉన్న ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తట్టినప్పటికీ లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోగా దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు.

చదవండి: (సర్పాలతో మేలే.. రాష్ట్రంలో విషపూరిత సర్ప జాతులు నాలుగే)

కేపీహెచ్‌బీ పోలీసులు వెళ్లి తలుపు గడియ పగుల గొట్టి లోనికి వెళ్లి చూడగా కిచెన్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు సరళ, మరో గదిలోని సీలింగ్‌ ప్యాన్‌కు సందీప్‌లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. అంతేకాకుండా ఇద్దరి మృతదేహాలు కూడా ఢీ కంపోజ్డ్‌ స్థితికి చేరడాన్ని బట్టి మూడు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భర్త వరప్రసాద్‌ వచ్చి పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తేనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. 

కలెక్టర్‌ అవుదామని.. 
సందీప్‌ చంద్ర కలెక్టర్‌ కావాలని కళలు కని అందుకు తగిన విధంగా సిద్ధమయ్యాడు. అయితే రెండు సార్లు ఇంటర్‌వ్యూ స్థాయికి చేరుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకున్నాడు. తాము పోగు చేసుకున్న సొమ్ముతో పాటు తెలిసిన వారి వద్ద కూడా కొంత మొత్తం అప్పుగా తీసుకొని ఓ భూమిని కొనుగోలు చేశాడని, అది వివాదాల్లో చిక్కుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని సందీప్‌చంద్ర స్నేహితులు పేర్కొనడం గమనార్హం.

స్థానికంగా పలువురి వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడం, జీవితంలో స్థిరపడకపోవడం వంటి పలు ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు సైతం భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com 

మరిన్ని వార్తలు