భర్త వేధింపులు: ఎస్‌ఐ న్యాయం చేయడం లేదని..

19 Apr, 2021 08:44 IST|Sakshi
చికిత్స పొందుతున్న వివాహిత 

సాక్షి, టేకులపల్లి: టేకులపల్లి పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఓ వివాహిత పురుగు మందు తాగి నిరసన తెలిపింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బేతంపూడి స్టేజీకి చెందిన గుగులోత్‌ భద్రు కుమార్తె ప్రేమకు గోలియాతండాకు చెందిన వాంకుడోత్‌ కుమార్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పరస్పరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పెద్దలు పంచాయితీలు కూడా చేశారు.

కాగా ఈ కేసు విషయంలో ఎస్‌ఐ తనకు న్యాయం చేయడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మనస్తాపానికి గురైన వివాహిత తనతో తెచ్చుకున్న పురుగు మందు తాగింది. తనను భర్త కుమార్‌ తరచూ వేధిస్తున్నాడని, విడాకులు కోసం కుట్ర చేస్తున్నారని, ఎస్‌ఐ కూడా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే పోలీసులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

ఈ విషయమై ఎస్‌ఐ ఇమ్మడి రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా...పుట్టింటికి వెళ్లిన తన భార్య ప్రేమ కాపురానికి రావడం లేదని భర్త కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కోసం పిలిపించామని తెలిపారు. ఇద్దరికి నచ్చజెప్పి కాపురాన్ని నిలబెట్టేందుకు యత్నిస్తున్న క్రమంలో స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లి ఏదో తెలియని ద్రవం తాగిందని పేర్కొన్నారు.

చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాగా బాధితురాలి భర్త కుమార్‌ మాట్లాడుతూ.. ప్రేమ రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లి ఎంతకీ రాలేదని, తమపైనే స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. స్టేషన్‌లో పురుగు మందు తాగడానికి తనకు, ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. 

చదవండి: రెండేళ్ల ప్రేమ.. పెళ్లనగానే!
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు