పరువు హత్య: ఐదు నెలల క్రితమే రామకృష్ణ హత్యకు సుపారీ కిల్లర్‌ లతీఫ్‌ పక్కా ప్లాన్‌!

18 Apr, 2022 09:05 IST|Sakshi
లకుడారం శివారులో పాతిపెట్టిన రామకృష్ణగౌడ్‌ శవాన్ని బయటకు తీస్తున్న పోలీసులు

భువనగిరి క్రైం/కొండపాక (గజ్వేల్‌): యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఓ వీఆర్వో సుపారీ గ్యాంగ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని అల్లుడిని దారుణంగా మట్టు బెట్టించాడు. భువనగిరి ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రామచంద్రయ్య గౌడ్‌ కుమారుడు ఎరుకల రామకృష్ణ (32) 2019లో యాదగిరిగుట్టలో హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. అప్పట్లో యాద గిరిగుట్టలోనే ఉంటూ వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశంతో రామకృష్ణకు పరిచయం ఏర్పడింది. దీంతో రామకృష్ణ తరచూ వెంకటేశం ఇంటికి వచ్చి పోతుండేవాడు.

ఈ క్రమంలో వెంకటేశం కూతురు భార్గవితో రామకృష్ణకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, వెంకటేశం కొద్ది రోజులకే వీరి ప్రేమ విషయం తెలుసుకుని రామకృష్ణను దూరం పెట్టాడు. ఇదే క్రమంలో 2019లో తుర్కపల్లిలో గుప్తనిధుల కేసులో రామకృష్ణను విధుల నుంచి తొలగించారు. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో రామకృష్ణను వెంకటేశమే గుప్తనిధుల కేసులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా అప్పటి నుంచి రామకృష్ణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. 
(చదవండి: వాలీబాల్‌ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి )

పలుమార్లు బెదిరించినా ఫలితం లేక.. 
రామకృష్ణ, భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత రెండు నెలల్లోనే  రెండుసార్లు వెంకటేశం తన కుమార్తెను వదిలిపెట్టాల్సిందిగా రామకృష్ణను బెదిరించాడు. ఈ క్రమంలో భార్గవి ఆస్తిలో వాటా అడగనంటూ తండ్రికి ఓ పత్రం కూడా రాసిచ్చింది. భువనగిరి తాతానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న రామకృష్ణ దంపతులకు ఓ పాప (ప్రస్తుతం ఆరు నెలలు) కూడా పుట్టింది.   

సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకుని.. 
రామకృష్ణపై కక్ష పెంచుకున్న వెంకటేశం కొద్ది నెలల క్రితమే అతన్ని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్‌ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు చెల్లించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్‌ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా పనిచేయలేదు. మరుసటి రోజు కూడా రామకృష్ణ ఆచూకీ లేకపోవడంతో భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

గోనె సంచిలో కట్టి, వాహనంలో తరలించి.. 
లతీఫ్, అమృతయ్యలు రామకృష్ణను గుండాల మండలం రామారం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ మరో తొమ్మిది మందితో కలిసి తాళ్లతో బంధించారు. అనంతరం రామకృష్ణ తలపై మేకులు కొట్టి దారుణంగా హింసించి అదే రోజు రాత్రి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి టాటాఏస్‌ వాహనంలో లతీఫ్‌ ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజాము వరకు శవాన్ని వాహనంలోనే ఉంచారు. తర్వాత కొండపాక మండలం లకుడారం గ్రామంలోని ఓ నీళ్లు లేని కాల్వలో పూడ్చిపెట్టారు.    

ఐదు నెలల క్రితమే వ్యూహరచన 
రామకృష్ణను హత్య చేసేందుకు ఐదు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు సుపారీ కిల్లర్‌ లతీఫ్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 11మంది భాగస్వాములు కాగా, లతీఫ్, గోలి దివ్య, అఫ్జల్, మహేశ్‌లను అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు, ఆస్తిలో వాటా కావాలని రామకృష్ణ ఒత్తిడి చేస్తుండడంతోనే అతడిని హత్య చేయాలని వెంకటేశం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రామకృష్ణ హత్యోదంతం బయటకు రాగానే యాదగిరిగుట్ట పట్టణం శ్రీరాంనగర్‌లో ఉంటున్న వెంకటేశం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. 
(చదవండి: బంజారాహిల్స్‌లో భూకబ్జా ముఠా హల్‌చల్‌)

పూడ్చిన గొయ్యి తవ్వి.. 
భార్గవి ఫిర్యాదు నేపథ్యంలో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన భువనగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు లకుడారం గ్రామ శివారులో శవాన్ని పూడ్డి పెట్టినట్టుగా అందిన సమాచారం మేరకు.. ఆదివారం ఉదయం లకుడారం శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద  రైల్వే పనులు జరుగుతున్న చోట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాల్వలో గొయ్యి తీసి పూడ్చివేసినట్టు అనుమానం రావడంతో సాయంత్రం రామకృష్ణ చిన్నమ్మ కుమారుడు జహంగీర్‌గౌడ్‌ సమక్షంలో కుకునూరుపల్లి పోలీసులతో కలిసి తవ్వించారు. మృతదేహం కన్పించడంతో బయటకు తీశారు. అది రామకృష్ణదేనని జహంగీర్‌ నిర్ధారించాడు. కాగా తన కొడుకును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని రామకృష్ణ తల్లి కలమ్మ డిమాండ్‌ చేసింది. 

నా తండ్రే హత్య చేయించాడు  


నేను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో నా తండ్రే డబ్బులిచ్చి హత్య చేయించాడు. నా బంధువు మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను నా భర్తకు పరిచయం చేశాడు. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్‌ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారు.     
– భార్గవి 

మరిన్ని వార్తలు