మైనర్‌ బాలికపై వేధింపులు.. ఆకతాయి అరెస్టు..

7 Jul, 2021 18:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయనగరం క్రైమ్‌: ఆపద సమయాన దిశ యాప్‌ను ఆశ్రయించిన బాలికను పోలీసులు రక్షించారు. పోలీస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  మెంటాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనరు బాలిక ఆపదలో ఉన్నట్టుగా మంగళవారం దిశ మొబైల్‌ యాప్‌లోని ఎస్‌ఎఎస్‌ బటన్‌ని ప్రెస్‌ చేసింది. సమాచారం విజయవాడలోని దిశ కంట్రోల్‌ రూమ్‌కి అందింది. దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది వెంటనే స్పందించి విజయనగరం దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌కు సమాచారం అందించారు.

వివరాలను ఎస్పీ బి.రాజకుమారికి తెలిపి ఆమె ఆదేశాలతో బాలికను రక్షించేందుకు ఆండ్ర ఎస్సైకి సమాచారమందించారు. ప్రత్యేక పోలీసు బృందం వెంటనే బాలిక ఉంటున్న లొకేషన్‌ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంది. బాలికను వేధింపులకు గురిచేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదుచేసింది. ఈ సందర్భంగా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ మహిళల భద్రతకు దిశ యాప్‌ భరోసా కల్పిస్తోందన్నారు. ప్రతి మహిళా తమ మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. బాలిక ధైర్యం చేసి, దిశ ఎస్‌ఓఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేయడంతో సకాలంలో సంఘటనా స్థ్ధలానికి చేరి, రక్షించగలిగామన్నారు.  


 

మరిన్ని వార్తలు