అప్పటి వరకు స్నేహితులతో సరదాగా గడిపాడు.. అంతలోనే..

16 Aug, 2021 13:58 IST|Sakshi
కల్యాణ్‌(ఫైల్‌)

సాక్షి, బయ్యారం(వరంగల్‌): ఈత వస్తుందనే నమ్మకం ఓ యువకుడి పాలిటశాపమైంది. సరదాగా స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి బయ్యారం పెద్దచెరువులో ఈత కొడుతూ నీటిలో మునిగిపోయాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్‌నగర్‌కు చెందిన తెల్ల బోయిన కల్యాణ్‌(24) తన మిత్రులు లక్ష్మణ్, భాను, అరవింద్, రాకేష్, ప్రేమ్‌ కుమార్‌తో కలిసి బయ్యారం పెద్ద చెరువు అలుగుల వద్దకు వెళ్లారు.

చెరువు వద్ద భోజనం చేసిన అనంతరం మిగతా మిత్రులకు ఈత రాకపోవడంతో వారు ఒడ్డున కూర్చోగా కల్యాణ్‌ ఈత వస్తుందనే నమ్మకంతో దిగాడు. కొంత సమయం పాటు ఈత కొట్టిన తర్వాత కల్యాణ్‌ నీటిలో మునిగిపోయాడు.  దీంతో ఈ విషయాన్ని కల్యాణ్‌ కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు తెలిపారు. గార్ల– బయ్యారం సీఐ తిరుపతి, గార్ల ఎస్సై రవి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.  

మరిన్ని వార్తలు