యువ దంపతుల ఆత్మహత్య.. ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ

25 Nov, 2022 10:44 IST|Sakshi
​​​​​​​ఆత్మహత్య చేసుకున్న స్రవంతి, సతీశ్‌

దంపతులిద్దరూ పని కోసం నగరానికి వలసొచ్చారు. ఆభరణాల తయారీతో జీవితం మారుతుందనుకున్నారు. ఎన్నో ఆశలతో బతుకు ప్రయాణం మొదలెట్టారు. చేతినిండా పని దొరకలేదు.. జేబులో గవ్వ నిలవలేదు! చుట్టూ ఆర్థిక చీకట్లు అలుముకున్నాయి. చావొక్కటే మార్గంలా కనిపించింది.. ఆభరణాలకు మెరుగుపట్టే సైనేడ్‌ తీపి పాయసమైంది భార్యాభర్తలిద్దరూ గుండెనిండా దుఃఖంతో మింగారు. ఈలోకం విడిచి వెళ్లారు. పిల్లలు, వృద్ధులను ఒంటరి వాళ్లను చేశారు. ఇప్పుడు వీరికి దిక్కెవరు? 

సాక్షి, వరంగల్‌: బంగారం వ్యాపారానికి వరంగల్‌ నగరం అడ్డా. ఇక్కడ ఎంతోమంది స్వర్ణకారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. విశ్వకర్మ వీధిలో బంగారు ఆభరణాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే తన జీవితాన్ని బంగారుమయం చేసుకుందామని జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీశ్‌ అలియాస్‌ నవధన్‌ (33) భార్య స్రవంతి(28)తో కలిసి నగరానికి వచ్చాడు. పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు విరాట్, విహార్‌. కరోనా.. ఆతరువాత అంతో ఇంతో కోలుకున్నా.. రానురానూ పని దొరకడం కష్టమైంది. 

కుటుంబ పోషణ భారమై..
ఇటీవల కొద్ది రోజుల నుంచి పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు ఉండడం లేదు. ఇంట్లో వృద్ధాప్యంలో కాలు విరిగిన నాన్న, అమ్మ. భార్యా, ఇద్దరు పిల్లలు.. కుటుంబ పోషణ కష్టమైంది. తెలిసిన వారి దగ్గర, ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో అప్పు తెచ్చి బతుకు బండిని నెట్టుకొచ్చాడు. అప్పులిచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని అడగడం మొదలెట్టారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దైన్యం. దంపతులకు రూ. 10లక్ష నుంచి రూ.20లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది.

అప్పులు తీర్చేదారి కని పించక సతీశ్‌ మానసికంగా కుంగిపోయాడు. రో జూ భార్యతో చెబుతూ బాధపడేవాడు. నాలుగు రోజులక్రితం తన తండ్రి మోహన్‌తో తన గోస చెప్పి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేయగా, ఏమీ కాదు.. అన్ని సర్దుకుంటాయని మనోధైర్యం కల్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటింది. 
చదవండి: Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్‌..


ప్రాణాలతో బయటపడిన విరాట్‌, సైనేడ్‌ను నీళ్లతో కలుపుకొని తాగిన బాటిళ్లు 

నాన్నా.. ఇది దేవుడి తీర్థం రా..
ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న సతీశ్, స్రవంతిలు.. గురువారం రాత్రి చిన్న కుమారుడు నానమ్మ, తాతయ్య దగ్గర ఆడుకుంటుండగా పెద్దకుమారుడు విరాట్‌ను తీసుకుని బెడ్‌రూంలోకి వెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్‌ను వాటర్‌బాటిళ్లలో కలుపుకుని భార్యాభర్తలిద్దరూ తాగారు. పెద్దకుమారుడికి ‘దేవుడి తీర్థం రా తాగు’ అంటూ నోట్లో పోశారు. వెంటనే బాలుడు బయటికి ఉమ్మి వేశాడు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడగా, దంపతులిద్దరూ చనిపోయారు. 

కొడుకు ఇంత పనిచేస్తాడనుకోలేదు..
చేతికొచ్చిన కొడుకు తమను సాకుతాడని భావించిన తండ్రి ఆకొడుకు కన్న పిల్లల బాధ్యత చూడాల్సి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘కొడుకా.. ఇంత పనిచేస్తావనుకోలేదు’అంటూ ఆ వృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వర్ణకారులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు