మహిళా సమస్యలపై పోరాడుతున్న యువతికి వేధింపులు..

30 Apr, 2021 11:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: సోషల్‌ మీడియాలో మహిళల సమస్యలపై పోరాడుతున్న యువతిని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని నందినగర్‌లో నివాసముంటున్న యువతి(31) బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. మహిళలపై జరుగుతున్న వేధింపులను తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా వెలుగులోకి తీసుకొస్తుంటుంది.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ ద్వారా మల్లికార్జున్‌ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు అశ్లీల ఫొటోలను పంపిస్తున్నారు. అతడితో పాటు కెరాటాల రాజేశ్వరి, తాళ్ల శివారెడ్డి, స్నేహారెడ్డి తదితరులు కూడా ఇదే విధంగా అసభ్యంగా మాట్లాడుతూ అశ్లీల ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేస్తూ తన పేరుతో ఫేక్‌ అకౌంట్‌ను నిర్వహిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 354(ఏ), 66(డి), 67ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు