-

పోక్సో చట్టం కింద పూజారికి పదేళ్ల జైలు

24 May, 2022 11:55 IST|Sakshi

విశాఖ లీగల్‌: బాలికను మోసగించి మాయమాటలతో వివాహం చేసుకుని లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని పొక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. జైలుశిక్షతోపాటు రూ.20వేల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పుల్లకందం సతీష్‌కుమార్‌ విజయనగరం జిల్లా జియ్యమ్మవలసకు చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో పూజారి.

బాధిత బాలిక విశాఖలోని గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంట్యాడలో ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్‌ 30న బాలిక తమ బంధువుల ఇంట్లో వివాహానికి విజయనగరం వెళ్లింది. పెళ్లిలో సతీష్‌కుమార్‌ బాలికను చూశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. బాలిక విజయనగరంలోని సతీష్‌ ఇంటికి వెళ్లగా ఇద్దరూ గుడిలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

అనంతరం అన్నవరంలో కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తగిన సమాచారంతో సతీష్‌ని, బాధితురాలిని పట్టుకున్నారు. అనంతరం వివాహానికి సహకరించిన సతీష్‌ తల్లి పుల్లకందం గిరిజ, సోదరుడు పుల్లకందం సంతోష్‌కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో లైంగికదాడికి సహకరించిన వారిద్దరికీ  ఐపీసీ సెక్షన్‌ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమానా విధించారు. సతీష్, అతని సోదరుడు, తల్లిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.    

(చదవండి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం)

మరిన్ని వార్తలు