ఫ్రెండ్‌తో బయటకు వెళ్లాడు.. బెంగళూరులో అరెస్ట్‌ అయ్యాడు..

4 Jul, 2021 08:55 IST|Sakshi
దివాకర దళపతి

జయపురం: కొరాపుట్‌ జిల్లాలో యువత గంజాయి బాట పడుతున్నారు. తక్కువ వ్యయంతో రూ.లక్షలు గడించవచ్చని పలువురు యువకులు గంజాయి మాఫియా వలలో పడుతూ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా కొందరు, తల్లిదండ్రుల అనుమతితోనే మరికొందరు గంజాయి రవాణాలో మమేకం అవుతున్నారు. తాజాగా శనివారం వెలుగు చూసిన సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. దసమంతపూర్‌ గ్రామంలో అంబిక దళపతి కుమారుడు దివాకర దళపతి జూన్‌ 28న తన స్నేహితునితో టంగినిగుడ గ్రామం వెళ్లొస్తానని చెప్పాడు. దివాకర్‌ ఇంటికి తిరిగి రాకపోవటంతో అతడి స్నేహితులు, బంధువులు అన్ని ప్రాంతాలలో గాలించారు. అయినా కుమారుడి జాడ తెలియక తల్లి.. బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో శనివారం దివాకర్‌ దళపతితో పాటు మరో ఇద్దరు యువకులను బెంగళూరు పరిదిలోని మాదబలి పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు బొయిపరిగుడ పోలీసులకు సమాచారం అందింది. వారి నుంచి 150 కేజీల గంజాయిని, రవాణాకు వినియోగించిన కారును స్వాదీనం చేసుకున్నట్లు మాదబలి పోలీసులు బొయిపరిగుడ పోలీసులకు తెలియజేశారు. జూన్‌ 28న కారులో గంజాయిని బెంగళూరుకు రవాణా చేస్తుండగా, తమకు చిక్కారని మధుబలి పోలీసులు బియపరిగుడ పోలీసులకు తెలిపారు. 

మరిన్ని వార్తలు