కేడీ నెంబర్‌ 1: న్యూడ్‌ వీడియోలు డిలీట్‌ చేయాలంటే ఖర్చవుతుందని చెప్పి...

19 Jul, 2021 19:28 IST|Sakshi
నిందితుడి అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

సాక్షి, చేబ్రోలు (పొన్నూరు): బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడు, ఆ బాలిక అక్కతో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్న ఉదంతం ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు ప్రాంతానికి చెందిన వేములపల్లి జోష్‌బాబు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలలో కంప్యూటర్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గణపవరం ప్రాంతానికి చెందిన బాలిక చేబ్రోలులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.

ఫోన్‌ నంబరు తీసుకొని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. దసరా సెలవులకు వచ్చినప్పుడు యాసిడ్‌ పోసి అమ్మమ్మను చంపుతానని బెదిరించి 2019లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువకుడు బెదిరింపులకు భయపడి ఎవరికీ చెప్పకుండా బాలిక ఊరు వెళ్లిపోయింది. 2020లో సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులకు వచ్చినప్పడు కూడా మళ్లీ బెదిరించి పలుమార్లు లైంగికదాడి చేశాడు.

తరచూ వాట్సాప్‌ వీడియో కాల్‌లో బెదిరించి న్యూడ్‌ వీడియోలు తీశాడు. ఆ తరువాత ఆ వీడియోలు వైరల్‌ చేస్తానని బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు చైన్, కొంత డబ్బు తీసుకున్నాడు. బాలిక నాన్నకు ఫోన్‌ చేసి మీ అమ్మాయి న్యూడ్‌ వీడియోలు వేరే వాళ్ల ఫోన్‌లో ఉన్నాయని వాటిని డిలీట్‌ చేయాలంటే ఖర్చు అవుతుందని చెప్పి విడతల వారీగా రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. బాలిక అక్క వద్ద నుంచి మీ చెల్లెల అశ్లీల వీడియోలు తొలగించాలంటే ఖర్చవుతుందని చెప్పి బంగారు గొలుసు పుచ్చుకున్నాడు.

బాలిక అక్కను ప్రేమ పేరుతో ఎవరికీ తెలియకుండా ఈ నెల 13వ తేదీ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. జరిగిన సంగతులను బాధితురాలు వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు గుంటూరులో లాయర్‌ను కలవడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు బంగారు గొలుసులు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, సిబ్బంది నిందితుడు జోష్‌బాబును అరెస్ట్‌ చేసినట్లు సౌత్‌ జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు