-

యువతితో రెండేళ్ల సహజీవనం.. ఆ తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌

18 Jul, 2021 09:47 IST|Sakshi

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడికి సంకెళ్లు

కంభం(ప్రకాశం జిల్లా): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం సీఐ బీటీ నాయక్, కంభం ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావులు కేసు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మండలంలోని చిన్నకంభం గ్రామానికి చెందిన కాగిపోగు ప్రభాకర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాల వైద్యుడికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే వైద్యశాలలో డెంటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పట్టణానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు.

ఇద్దరూ ప్రేమలో పడి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అడుగుతుండగా మాట దాటేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడన్న విషయం తెలుసుకొని అతడిని ప్రశ్నించింది. అతను ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి పరారవడంతో బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీసుస్టేషన్‌ ఈ నెల 14వ తేదీన ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 16వ తేదీ సాయంత్రం మార్కాపురం బస్టాండ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడిని అరెస్టు చేసి గిద్దలూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు