సర్ది చెప్పడానికి వెళ్లాడు.. శవమై వచ్చాడు!

30 Aug, 2021 03:04 IST|Sakshi
సంఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని  పరిశీలిస్తున్న కోదాడ డీఎస్పీ రఘు

వైన్స్‌ సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి 

మృతుడు ఏపీ వాసి 

కోదాడ: మద్యం దుకాణం వద్ద జరుగుతున్న గొడవను ఆపి సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైన్స్‌ సిబ్బంది కర్రలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఏపీ సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్‌లో హనుమాన్‌ వైన్స్‌ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి ఏపీలోని కృష్ణాజిల్లా షేర్‌ మహ్మద్‌పేటవాసి కావడంతో గ్రామానికి చెందిన పలువురు అక్కడి చేరుకొని మృతదేహంతో ధర్నాకు దిగారు. దీంతో వైన్స్‌ ముందు ఉద్రిక్తత ఏర్పడింది.

షేర్‌మహ్మద్‌పేటకు చెందిన రైతు నాగయ్య మద్యం కోసం రామాపురం వద్ద వైన్స్‌కు వచ్చాడు. అప్పటికే షేర్‌మహ్మద్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులతో వైన్స్‌ సిబ్బంది గొడవ పడుతున్నారు వారిని వారించడానికి నాగయ్య అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో వైన్స్‌ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో నాగయ్య తలపైబలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.  

వైన్స్‌ముందు గ్రామస్తుల ధర్నా 
వైన్స్‌ సిబ్బంది దాడిలో తమ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న షేర్‌మహ్మద్‌పేట వాసులు, బంధువులు పెద్ద ఎత్తున రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొని వైన్స్‌ ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న కోదాడ టౌన్‌ సీఐ నరసింహారావు, రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా నాగయ్య మృతి చెందగానే వైన్స్‌ను మూసివేసి సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని బంధువుల ఫిర్యాదు అందిన తరువాత పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు 
తెలిపారు. 

మరిన్ని వార్తలు