దారి కాచి.. దాడి చేసి.. 

23 Sep, 2022 07:38 IST|Sakshi

సాక్షి, బంజరాహిల్స్‌: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిపై నలుగురు ఆకతాయిలు మద్యం మత్తులో కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీకి చెందిన నగేష్‌  కొత్త చెరువు వద్ద ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వహిస్తుంటాడు.

బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు డబ్బులు డిమాండ్‌ చేస్తూ అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వెళ్లిన క్షణాల్లోనే చెట్ల మాటున దాక్కున్న మిగతా ముగ్గురు మళ్లీ అక్కడికి వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి బాధితుడిపై కర్రలతో దాడి చేసి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన అతడిని   అపోలో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు కొద్దిసేపు నిఘా ఉంచితే మళ్లీ దాడి జరిగి జరిగే ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.    

(చదవండి: భార్య గొంతుకోసి హత్య)

>
మరిన్ని వార్తలు