నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ ఆర్తనాదాలు

26 Jun, 2021 13:08 IST|Sakshi
కన్నీరు మున్నీరవుతున్న మృతుడి కుటుంబీకులు ఇన్‌సెట్లో శివకుమార్‌(ఫైల్‌)    

దౌలాపూర్‌ గుట్టల్లో మృతదేహం లభ్యం

డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీంతో తనిఖీలు

సాక్షి, మెదక్‌: యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన పాపన్నపేట మండలం దౌలాపూర్‌ శివారులోని కోటగుట్టల్లో చోటు చేసుకుంది.  గురువారం  ఇంటి నుంచి వెళ్లిన యువకుడు శుక్రవారం శవమై కనిపించాడు. బాధితుల ఫిర్యాదుల మేరకు మెదక్‌ రూరల్‌సీఐ పాలవెల్లి ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసుల కథనం మేరకు.. పాపన్నపేట మండలం మిన్‌పూర్‌ గ్రామానికి చెందిన నాయికోటి కిష్టయ్య–మంగమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరిలో చిన్న కొడుకు నాయికోటి శివకుమార్‌(27) ఐటీఐ చదివి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ప్యాక్టరీలో పనిచేస్తున్నాడు.

శివకుమార్‌కు మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన పావనితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇటీవల లాక్‌డౌన్‌ నేపథ్యలో శివకుమార్‌లో మిన్‌పూర్‌లో ఉంటూ తండ్రికి తోడుగా ఉండి వ్యవసాయ పనులకు సాయ పడుతున్నాడు. తండ్రి కిష్టయ్య అనారోగ్యంగా ఉండటంతో మెదక్‌కు వెళ్లి ఆస్పత్రిలో వైద్యం చేయిద్దాం.. నేనిప్పుడే వస్తానంటూ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొడుకు కోసం వేచి చూసిన కిష్టయ్య ఒక్కడే మెదక్‌కు ఆస్పత్రికి వెళ్లి తిరిగివచ్చాడు. కాగా గురువారం రాత్రి వరకు ఇంటి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వచ్చింది.

కోటగుట్టపై శివకుమార్‌ బైక్‌
కాగా గురువారం మధ్యాహ్నం దౌలాపూర్‌ కోటగుట్ట ప్రాంతం నుంచి ‘నన్ను చంపుతున్నారు.. రక్షించండంటూ..’ఆర్తనాదాలు వినిపించాయని గొర్రెల కాపర్లు శుక్రవారం ఉదయం గ్రామసర్పంచ్‌ లింగారెడ్డికి తెలిపారు. దీంతో అనుమానించిన కొంతమంది గ్రామస్తులు కోటగుట్టపైకి వెళ్లగా శివకుమార్‌ బైక్‌ కనిపించింది. కొంత దూరంలో బండరాళ్ల నడుమ శివకుమార్‌ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో మెదక్‌ రూరల్‌సీఐ పాలవెల్లి, పాపన్నపేట ఎస్‌ఐ సురేశ్‌ ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. మరోవైపు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడి తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు. 

చదవండి: నాలుగేళ్లుగా ప్రేమ, సహజీవనం, పెళ్లి ప్రస్తావన తేవడంతో!
ఇక్కడ ఒక్కో డబుల్ బెడ్‌రూం విలువ కోటిన్నర: కేటీఆర్‌

మరిన్ని వార్తలు