ప్రేమ పేరుతో దగ్గరై మూడు సార్లు​ అబార్షన్‌.. చివరకు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో

20 Sep, 2022 21:12 IST|Sakshi
బాధితురాలితో చర్చిస్తున్న డీఎస్పీ.. ఇన్‌సెట్‌లో ఆదిమూలం

సాక్షి, తిరుత్తణి (చెన్నై): యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. తిరుత్తణి సమీపంలోని బుచ్చిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బాలనాగమ్మ(29) తిరుత్తణి పోలీస్‌స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పళ్లిపట్టు మండలం ఎగువ నెడిగళ్లు కాలనీకి చెందిన ఆదిమూలం(30)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వివాహం చేసుకుంటానని నమ్మించడంతో శారీరకంగా దగ్గరయ్యారు. ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పడంతో అతని మాటలు నమ్మిన బాలనాగమ్మ మూడుసార్లు అబార్షన్‌ చేయించుకుంది. చివరికి తనకు వేరొక అమ్మాయితో పెళ్లి కుదిరిందని చెప్పాడు. దీంతో న్యాయం కోసం తిరువళ్లూరు ఎస్పీ  కల్యాణ్‌ను ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు తిరుత్తణి డీఎస్పీ విగ్నేష్‌ సూచనలతో తిరుత్తణి మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం  సాయంత్రం ఇరు కుటుంబాలను పిలిపించారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించిన యువతి, బంధువులు

చదవండి: (ఆ యువతితో ఉన్న 10 రోజులు మరుపురానివి.. తల్లిదండ్రులు..)

ఈ క్రమంలో ఆ యువకుడు తాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో యువతి బంధువులతో కలిసి అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తిరుత్తణి–పొదటూరుపేట రోడ్డులో వాహనాలు ఆగిపోవడంతో డీఎస్పీ ఇరు వర్గాలతో చర్చించారు. అయినా పెళ్లికి యువకుడు అనాసక్తి వ్యక్తం చేయడంతో అతన్ని న్యాయస్థానంలో హజరుపరిచి జైలుకు తరలించారు.  

యువతిని కించపరిచేలా వ్యవహరించిన డీఎస్పీ 
తనకు న్యాయం చేయాలని నిరసన తెలిపిన యువతిని డీఎస్పీ కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఉన్నత పదవుల్లో ఉంటూ బాధితురాలికి న్యాయం చేయాల్సిన అధికారి ఏకవచనంలో అసభ్య పదజాలంతో మాట్లాడడం విమర్శలకు దారి తీసింది. 

మరిన్ని వార్తలు