అనన్యా .. సారీ! నువ్వు నాతో సంతోషంగా బతకలేవు

28 May, 2022 12:35 IST|Sakshi

‘అనన్య సారీ.. నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు.. బాపు, అమ్మా.. తమ్ముడు సారీ.. నాకు బతకాలని లేదు. అప్పులు బాగా పెరిగిపోయాయి. నాతో ఐతలేదు. మీకు చెప్పేధైర్యం వస్తలేదు. నా చావుకు కారణం ముద్రకోల రామాంజనేయులు. అవసరానికి అప్పు చేశాను. వడ్డీకి వడ్డీ వేశాడు. రూ.20 లక్షలు కట్టుమంటుండు. నా రక్తం తాగుతుండు. బయట పది లక్షలు అప్పుతెచ్చి కట్టిన. ఇంకో రూ.20 లక్షలు కట్టుమంటుండు. నీతో కాకుంటే పొలం అమ్ము అంటుండు. తమ్ముడూ... అమ్మ, బాపును, అమ్మమ్మను మంచిగ చూసుకో. నేను పెద్ద తప్పు చేశా అప్పు చేసి. పెళ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేశా. బతుకుడు నాతో ఐతలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ లేఖ రాసి మానకొండూర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

కరీంనగర్ (మానకొండూర్‌) : అన్నారం గ్రామానికి చెందిన మార్క అంజయ్య– పద్మ దంపతుల పెద్ద కొడుకు ప్రశాంత్‌ (26). డిగ్రీ పూర్తిచేశాడు. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం అనన్యతో వివాహమైంది. అవసరం నిమి త్తం ఇదే గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారి ముద్రకోల రామాంజనేయులు వద్ద 10, 12, 15 శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు. కొన్నాళ్లకు చెల్లించాలని వేధించడంతో మరోచోట అప్పుచేసి రూ.10 లక్షలు చెల్లించాడు. మరో రూ.20 లక్షలు చెల్లించాలని వేధిస్తూ వచ్చాడు. పొలం అమ్మి అయినా అప్పు చెల్లించాలని, విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. వేధింపులు భరించలేని ప్రశాంత్‌ ఈ నెల 26న రాత్రి సూసైడ్‌ రాసి గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. విషయాన్ని ఫోన్‌ద్వారా కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున చనిపోయాడు.

గ్రామంలో ఉద్రిక్తత..
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అన్నారం గ్రామానికి తీసుకొచ్చా రు. రామాంజనేయులు ఇంటిఎదుట మృతదేహంతో ఆందోళనకు యత్నించగా.. సీఐ క్రిష్ణారెడ్డి అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. అయినా.. వినకుండా కుటుంబసభ్యులు రామాంజనేయులు ఇంటి వద్ద బైటాయించారు. చివరికి సీఐ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

తీసుకున్న అప్పు ఏం చేశాడు..?
ప్రశాంత్‌ డిగ్రీ పూర్తిచేయగా.. ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరితో కలివిగా ఉండే వ్యక్తి. అధిక వడ్డీలకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ‘రామాంజనేయులుకు అప్పు చెల్లించవద్దని.. విక్రంబావకు రూ.3 లక్షలు, శ్రీకాంత్‌ అల్లుడికి రూ.3 లక్షలు, దేవన్నకి రూ.1.50 లక్షలు, చింటుకు 1.50 లక్షలు, ముద్రకోల మధుకు రూ.లక్ష చెల్లించు’ అంటూ నోట్‌లో అతడి తమ్ముడు అజయ్‌కి సూచించాడు. ‘అప్పు ఎందుకు చేశాడో తెలియదు.. ఎంత చేశాడో తెలియదు.. బాగానే ఉంటాడు అనుకున్నాం.. ఇంతలో ఇలా జరిగింది’ అని అతని తల్లిదండ్రులు అంజయ్య– పద్మ చెబుతున్నారు.

ప్రాణాలు తీస్తున్న అధిక వడ్డీలు..
అధిక వడ్డీకి అప్పులు ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో పలు ఘటనలు చోటుచేసు కోగా.. పోలీసులు సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు పట్టణాల్లోనే ఉందనుకున్న దందా పల్లెలకు సైతం పాకడంతో ఆందోళన కలిగిస్తోంది.

అనన్య ఐదు నెలల గర్భిణి
ప్రశాంత్‌కు రామడుగు మండలం గుండికి చెందిన అనన్యతో 8 నెలల క్రితం వివాహం అయ్యింది. ప్రస్తుతం ఐదునెలల గర్భిణి. ప్రశాంత్‌ మృతితో అనన్య రోదనలు అరణ్య రోదనలు అయ్యాయి.‘నిండు నూరేళ్లు కలిసి ఉంటావనుకుంటే ఎనిమిది నెలలకే తీరని లోకాలకు వెళ్లిపోయావా.. నువ్వులేని నా జీవితం ఎలా గడుస్తుంది. కడుపులో బిడ్డ గుర్తుకురాలేదా’ అంటూ అనన్య రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ‘అప్పు ఉందంటే మేము కట్టేవాళ్లం కదా కొడుకా.. మాకు దిక్కెవరు బిడ్డా అంటూ..’ తల్లిదండ్రులు, తమ్ముడు అజయ్‌ గుండెలవిసేలా రోదించారు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు