టీనేజ్‌ యువకుడి‌ ఆత్మహత్య 

29 Dec, 2020 10:46 IST|Sakshi

వేంసూరు: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కల్లురూగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బత్తుల తిరుపతిరావు(24) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో ఈ నెల 24న గ్రామం నుంచి వెళ్లిపోయాడు. బాలిక తండ్రి 25వ తేదీన తమ కుమార్తె కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా తిరుపతిరావు ఆ బాలికను కృష్ణా జిల్లా అక్కపాలెం గ్రామంలో బాలిక బంధువుల ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తిరుపతిరావు స్నేహితుడైన తన్నీరు గోపిరాజును(19) ఆదివారం మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిపించి తిరుపతిరావు ఆచూకీ తెలపాలని విచారించి ఇంటికి పంపారు. దీంతో మనస్తాపానికి గురైన గోపిరాజు ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.   (అమ్మా.. నా భర్తతో ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా! )

పోలీసుల వేధింపులే కారణమంటూ ఆందోళన..
కాగా పోలీసులు వేధింపుల వల్లే గోపిరాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఉదయం పోలీసు స్టేషన్‌ వద్దకు ఆందోళన నిర్వహించేందుకు వెళ్తుండగా రాయుడుపాలెం– మర్లపాడు గ్రామాల మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మృతుడి బంధువులు రహదారిపై బైఠాయించారు. ఆ తరువాత పోలీసులు మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా తాము అతడిని పిలిచి విచారించామే తప్ప ఏమీ అనలేదని పోలీసులు వివరించారు.

ఏడుగురిపై కేసు నమోదు..
తమ కుమారుడి మృతికి బాలిక కుటుంబ సభ్యులు గుంజా మారేశ్వరరావు, గుంజా వెంకటేశ్వరరావు, గుంజా పార్వతి, గుంజా నాగరాణి, గుంజా కమలమ్మ, రాంబాబు, జయ కారణమని మృతుడి తండ్రి తన్నీరు వెంకటేశ్వరరావు సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై సాయికుమార్‌ తెలిపారు.  (నడిరోడ్డు మీద దారుణ హత్య.. కానీ )

>
మరిన్ని వార్తలు