నా చావుకు కారణం వారే.. పిన్ని వాయిస్‌ రికార్డ్‌ బయట పెట్టడంతో..

6 Aug, 2022 09:01 IST|Sakshi
మృతుడు రాజులపాటి అరవింద్‌ (25)

కృష్ణా (కంకిపాడు): పిన్ని వరుస అయ్యే మహిళ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో యువకుడిని విచారణకు పిలిచిన పోలీసులు అతడిని కొట్టడం, దూషించటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో కలకలం రేపింది. కంకిపాడు చెందిన రాజులపాటి అరవింద్‌ (25) ఉద్యోగ అన్వేషణలో బెంగళూరులో ఉంటున్నాడు. పోలీసుస్టేషన్‌కు ఎదురుగా ఉన్న నివాసాల్లో తన తల్లిదండ్రులు, పక్కనే బాబాయ్‌ పిన్ని వాళ్ల ఇళ్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితం తల్లికి, పిన్నికి మధ్య గొడవ జరగటంతో విషయం తెలుసుకున్న అరవింద్‌ తన వద్ద పిన్నికి సంబంధించి బయటి వ్యక్తులతో మాట్లాడిన వాయిస్‌ రికార్డులను తమ్ముడికి ఫోన్‌లో పంపాడు. ఈ విషయమై పిన్నిని ఆమె కొడుకు నిలదీశాడు. 

గతం నుంచి వాయిస్‌ రికార్డుల పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అరవింద్‌పై పిన్ని స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం అరవింద్‌ను పిలవటంతో గురువారం కంకిపాడుకు వచ్చాడు. పోలీసుస్టేషన్‌కు విచారణకు వెళ్లి తిరిగి వచ్చిన అరవింద్‌ శుక్రవారం తన నివాసంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

కొట్టి, తిట్టారు...బతుకు మీద ఆశ చచ్చిపోయింది 
‘కొన్నేళ్లుగా పిన్ని మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. నా వద్ద ఉన్న వాయిస్‌ రికార్డులను తమ్ముడికి పంపితే తల్లిని మార్చుకుంటాడని భావించాను. ఆరేళ్లుగా మాట్లాడని వ్యక్తిని నేను ఎలా వేధింపులకు గురిచేస్తాను. పిన్ని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. విచారణకు పిలిచి ఓ కానిస్టేబుల్‌ కొట్టిన దెబ్బలకు, తిట్టిన తిట్లకు, బూతులకు బతకాలనే ఆశ చచ్చిపోయింది. నిందితుడికి మాట్లాడే అవకాశం ఇవ్వమని ఎస్‌ఐకి విన్నవిస్తున్నా. 

నా చావుకు కారణం, పిన్ని, కానిస్టేబుల్‌’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ వెలుగుచూసింది. దీంతో పోలీసుల వ్యవహారం వివాదాస్పదం అయింది. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు శవంగా మారటంతో మృతుడి తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. పోలీసుస్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదుచేసిన తోటికోడలు, విచారణ పేరుతో పిలిచి ఇష్టానుసారం కొట్టిన కానిస్టేబులే తమ కుమారుడి మృతికి కారణం అని  ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు