-

కుమార్తె చేసిన చాటింగ్.. ఫొటోలు డిలీట్‌ చేయించి..

20 Aug, 2022 15:07 IST|Sakshi
గోదావరిలో గల్లంతైన సూర్యప్రతాప్‌

సాక్షి, మామిడికుదురు (తూర్పుగోదావరి): వారిద్దరిదీ ఒకే గ్రామం. ఒకే కులం. ఐదేళ్ల నుంచి ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నారు. చివరకు అతడిని పెళ్లి చేసుకునేందుకు యువతి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు శుక్రవారం వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలో దూకి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పూర్వాపరాలివీ.. మొగలికుదురు గ్రామానికి చెందిన బిళ్ల సూర్యప్రతాప్‌ (22) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

తన గ్రామానికే చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి కుదిరింది. ప్రతాప్‌ను పెళ్లి చేసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు కోరినప్పటికీ ఆ యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పైగా నగరం పోలీస్‌ స్టేషన్‌లో యువతి తండ్రి ఫిర్యాదు కూడా చేశారు. సూర్యప్రతాప్‌తో తన కుమార్తె చేసిన చాటింగ్, అతడితో కలిసి ఉన్న ఫొటోలు డిలీట్‌ చేయాలని, తన కుమార్తె జోలికి రాకుండా చూడాలని కోరాడు. దీనిపై గురువారం రాత్రి పోలీసులు ప్రతాప్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అతడి సెల్‌ఫోన్‌ తీసుకుని ఫొటోలు, మెసేజ్‌లు డిలీట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ఆ యువతి ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన చావుకు ఆమె, ఆమె తండ్రి కారణమని సెల్‌లో మెసేజ్‌ చేసిన సూర్యప్రతాప్‌ పాశర్లపూడి బ్రిడ్జిపై సెల్‌ఫోన్‌ పెట్టి వైనతేయ గోదావరి నదిలో దూకేశాడు. అతడి ఆచూకీ కోసం నగరం ఎస్సై షేక్‌ జానీబాషా ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. వరద కారణంగా గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సూర్యప్రతాప్‌ ఆచూకీ తెలియరాలేదు. యువకుడి తండ్రి బిళ్ల గణపతిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (Tirupati: ప్రయాణికులకు పది ప్రత్యేక రైళ్లు)

మరిన్ని వార్తలు