ఆసరాగా ఉంటాడనుకుంటే.. ఆయువు తీసుకున్నాడు

14 Jul, 2021 13:11 IST|Sakshi
మురళీ (ఫైల్‌)

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య   

కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం  

సాక్షి,ఆమదాలవలస: ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌ పరిధి కుద్దిరాం – ఆమదాలవలస మధ్య ట్రాక్‌పై మంగళవారం రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

జీఆర్‌పీ  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామానికి చెందిన మామిడి మురళీ(17) స్థానిక ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ సెకెండియర్‌ చదువుతున్నాడు. ఏదో విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై  రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నన్నాడు. ఆసరాగా నిలుస్తాడనుకున్న కుమారుడు మృత్యువు ఒడిలోకి చేరడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ మృతితో గ్రామంలో విషాదఛాయలు  అలముకున్నాయి.     

మరిన్ని వార్తలు