క్షమించండి నాన్నా...

13 Jul, 2022 07:40 IST|Sakshi

నేను ప్రేమించిన అమ్మాయి లేదు 

ఆమె లేకుండా నేను బతకలేను  

సూసైడ్‌ లేఖ రాసి ప్రేమికుడి ఆత్మహత్య 

కర్నూలు : ‘‘నాన్నా.. నాకు బతకాలని లేదు. మీకు తెలుసు నేను ఓ యువతిని ప్రేమించిన విషయం. ఆమె ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నాను. కానీ ఆమె ఇప్పుడు లేదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలియదు. నా ప్రేయసి ఎక్కడ ఉన్నా బాగుంటుందని ఇన్నాళ్లూ బతికాను. ఆమె బలవన్మరణం చెందిన విషయం తెలిసింది. ఇక నేను బతకను. సారీ నాన్నా’’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి మంగలి శివప్రసాద్‌ (22) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బి.అగ్రహారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.అగ్రహారం గ్రామానికి చెందిన మంగలి రామచంద్ర, వసుంధర దంపతులకు ఇద్దరు కుమారులు.

 పెద్ద కుమారుడు శివప్రసాద్‌ కోడుమూరు పట్టణంలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కోడుమూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఓ యువతి అదే కళాశాలలో డిగ్రీ చదువుతోంది. వారిద్దరూ  ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, వేరే చోటుకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గత ఏడాది కొంతకాలం వేరే చోటుకు వెళ్లిపోయారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికీ తెలియడంతో వారిని వెతికి పట్టుకుని తీసుకువచ్చారు. ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ చేశారు. వీరికి మైనార్టీ తీరలేదు కాబట్టి కొంతకాలం దూరం పెట్టి మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు మాట్లాడుకొని, ప్రేమికులను ఎవరి ఇంటికి వారిని పంపించారు. 

అయితే వీరిద్దరూ దూరంగా ఉన్నా వారి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ క్రమంలోనే ఆ యువతి సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం శివప్రసాద్‌కు ఆ విషయం తెలిసింది. తను ప్రేమించిన అమ్మాయి లేనప్పుడు తను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులకు వెళ్లిన అమ్మ తిరిగి ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి గుండెలు బాదుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌కిషోర్‌ రెడ్డి తెలిపారు.   

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు