కల్లు తాగి మత్తులో ఉంటాడు.. తిట్టారో... చచ్చారే... 

11 Aug, 2021 01:55 IST|Sakshi
డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ

తాగిన మత్తులో మూడు హత్యలు చేసిన యువకుడు

హత్య జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడు అరెస్ట్‌  

డిచ్‌పల్లి: కల్లు తాగిన మత్తులో ఉండగా ఎవరైనా అతడిని బూతులు తిడితే మృగంలా మారిపోతాడు. తనను తిట్టిన వారిని హత్య చేస్తాడు. ఇలా మూడు హత్యలకు పాల్పడిన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ షారూఖ్‌ (25)ను డిచ్‌పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌ సీపీ కార్తికేయ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 5న డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ శివారులోని శ్మశాన వాటిక ప్రహరీ పక్కన చెట్ల పొదల్లో మిట్టాపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు సుంకెట నర్సవ్వ (60) మృతదేహం లభించింది.

హత్యాస్థలంలో ఆధారాల మేరకు నిందితుడు షారూఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నర్సవ్వ హత్యకు ముందు మరో రెండు హత్యలు కూడా చేసినట్లు తెలిపాడు. ఈనెల 5న నర్సవ్వతో కలసి శ్మశాన వాటిక వద్ద కల్లు తాగుతుండగా ఆమె తిట్టిందని, దీంతో కోపమొచ్చి ఆమెను కల్లు సీసాతో కడుపులో పొడిచి చంపానన్నాడు. ఏడాదిన్నర క్రితం డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌ వద్ద మిట్టాపల్లి గ్రామానికి చెందిన సల్మాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి తిట్టినందుకు తలపై బండరాయితో కొట్టి చంపానని, ఫిబ్రవరిలో డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో షేక్‌ మోసిన్‌తో కల్లు తాగుతుండగా జరిగిన గొడవలో అతన్ని గ్రానైట్‌ రాయితో తలపై మోది హత్య చేశానన్నాడు. మూడు హత్యలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న షారూఖ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు