ఎద్దుల బండిని తప్పించబోయి..

29 Jul, 2020 12:03 IST|Sakshi
ధర్మతేజ(ఫైల్‌)

ద్విచక్ర వాహనం బోల్తా యువకుడి దుర్మరణం  

ఆరు నెలలక్రితమే వివాహం

కోడుమూరు రూరల్‌: ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని రామాపురం గ్రామం వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కోడుమూరుకు చెందిన చాకలి దస్తగిరి, బజారమ్మ పెద్ద కుమారుడు ధర్మతేజ (23) ఐటీఐ పూర్తి చేసి, ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. వెల్దుర్తిలో పని ముగించుకుని పట్టణానికి చెందిన స్నేహితుడు సతీష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై కోడుమూరు బయలుదేరాడు. మార్గమధ్యంలో రామాపురం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ప్రమాదంలో ధర్మతేజ తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందగా, సతీష్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య జయలక్ష్మి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

తమిళనాడు వాసి మృతి.. 
కర్నూలు: స్థానిక బళ్లారి చౌరస్తా ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం హోసూరు గ్రామానికి చెందిన శివకుమార్‌(49) అక్కడికక్కడే మృతిచెందాడు. ఐచర్‌ వాహనంలో తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ మంగళవారం తెల్లవారుజామున కర్నూలు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై ఆగి ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ లారీని ఢీకొనడంతో ముందు భాగమంతా నుజ్జునుజ్జై అందులో శివకుమార్‌ ఇరుక్కుపోయి మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు. వాహనంలో ఇరుక్కుపోయిన శివకుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు