-

ప్లాన్‌ బెడిసికొట్టింది

7 Aug, 2020 08:26 IST|Sakshi
యువకుడి మృతదేహం

నిర్లక్ష్యంగా డైవింగ్‌ 

యువకుడి దుర్మరణం 

తప్పించుకునేందుకు కాంట్రాక్టర్‌ యత్నం 

విచారణలో వాస్తవాలు వెలుగులోకి 

నిందితుడిపై కేసు నమోదు 

జూబ్లీహిల్స్‌: వేగంగా వచ్చిన దూసుకువచ్చిన కారు ఓ యువకుడిని భీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీజేఆర్‌ మైనింగ్‌ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్‌ రఘురాంరెడ్డి తన డ్రైవర్‌ విష్ణుతో కలిసి గురువారం కారులో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10 మీదుగా పంజగుట్ట వైపు వెళ్తున్నారు. కారు రెయిన్‌బో ఆస్పత్రి దాటగానే అదుపు తప్పి రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న యువకుడి(22)ని ఢీకొట్టి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో సదరు యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే రఘురాంరెడ్డి తెలివిగా కారు సీటులో నుంచి లేచి తన డ్రైవర్‌ను కూర్చోబెట్టాడు. రఘురాంరెడ్డికి కూడా స్వల్ప గాయాలు కావడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ ప్రమాదం తానే చేసినట్లు డ్రైవర్‌ విష్ణు పోలీసులకు లొంగిపోయాడు.  పోలీసులు అతడిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రమాదం తాను చేయలేదని తన యజమాని చేసినట్లు తెలిపాడు. రఘురాంరెడ్డి నిర్లక్ష్యంగా కారు  నడిపినందునే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తప్పు చేయడమే కాకుండా తప్పించుకుందామనుకున్న రఘురాంరెడ్డి పై పోలీసులు కేసు  నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు