పోలీసుల స్వార్థానికి నిండు ప్రాణం బలి 

28 Aug, 2020 08:48 IST|Sakshi
మృతుడు మున్నా (ఫైల్‌)

తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా  

యువకులను పావులుగా వాడిన ఖాకీలు

మద్యం సేవించి ఆటో నడిపిన కానిస్టేబుల్‌

కానిస్టేబుల్‌ నిర్వాకంతో యువకుడి మృతి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పిడుగురాళ్ల(గుంటూరు) : పోలీసుల స్వార్థానికి ఓ నిండు ప్రాణం బలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు కలసి చేతి వృత్తులు చేసుకుని జీవనం సాగించే నలుగురు వ్యక్తులను తమ వెంట ఓ ఆటోలో తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్లకు తీసుకెళ్లారు. అక్కడ ఫూటుగా మద్యం తాగి, వస్తూ వస్తూ ఆంధ్రాలో విక్రయించుకునేందుకు ఆటోలో కొంత మద్యం బాటిళ్లను తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో దామరచర్ల వాడపల్లి మధ్యలో పెట్రోలు బంకు సమీపంలో ఆటోను వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌ మెకానిక్‌ షేక్‌ బాబావలి అలియాస్‌ మున్నా(24) తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన నైతిక బాధ్యత కలిగిన పోలీసులే అక్కడి నుంచి పారిపోవడంతో పలు అనుమానాలకు దారితీసింది. ఈ సంఘటన ఈ నెల 14వ తేదీన జరిగింది. గాయాలపాలైన మున్నాను అతని స్నేహితులైన ఇస్మాయిల్, పి.జీవన్, ఆటో డ్రైవర్‌ మస్తాన్‌తో పాటు ముగ్గురు పోలీసుల్లో ఒక కానిస్టేబుల్‌ మాత్రమే హుటాహుటిన దామరచర్లలోని ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇంత జరిగినా క్షతగాత్రుడైన మున్నా తల్లిదండ్రులకు పోలీసులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. పిడుగురాళ్లలో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించిన తర్వాత మున్నా తల్లిదండ్రులైన గండు మస్తాన్‌వలి, తల్లి కరిమున్‌లకు ద్విచక్రవాహనం మీద వస్తుంటే ప్రమాదం జరిగిందని తప్పుడు సమాచారం ఇచ్చారు. విషయం తెలియక తల్లిదండ్రులు తమ కొడుకును రక్షించుకునేందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మున్నా ఈ నెల 23న మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాకపోవడంతో మృతుడి తల్లిదండ్రులు ప్రమాదం జరిగిన దామరచర్ల పోలీస్‌స్టేషన్‌లో 25వ తేదీన ఫిర్యాదు చేశారు. దీంతో దామరచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.  

కంచె చేను మేసిన చందంగా.. 
తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చే సమయంలో తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రం సరిహద్దులో వాడపల్లి బ్రిడ్జి వద్ద పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఈ నలుగురు వ్యక్తులను ఓ కేసు నిమిత్తం దామరచర్లకు తీసుకెళ్లి మళ్లీ పిడుగురాళ్లకు తీసుకువస్తున్నామని చెప్పేందుకు ఓ పథకం రచించారు. ఆటోలో మద్యం సీసాలను తీసుకుని కానిస్టేబుల్‌ చందు ఆటోను నడుపుతూ వస్తున్నారు. వెనుక నుంచి వస్తున్న కారు పలుమార్లు హారన్‌ కొట్టినా నిర్లక్ష్యంగా ఎడమ వైపు పక్కకు రావాల్సిన ఆటో కుడివైపునకు తిప్పడంతో అటుగా వస్తున్న కారు వారి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కేవలం ఆటో నడిపే కానిస్టేబుల్‌ వల్లే జరిగిందని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జానపాడు గ్రామానికి చెందిన మృతుడు మున్నాకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు మదార్‌వలి ఉన్నాడు. భార్య సియాబేగం ఎనిమిది నెలల గర్భిణి.  

పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం 
తెలంగాణ రాష్ట్రంలోని దామరచర్లకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో పాటు నలుగురు వ్యక్తులు కలిసి ఆటోలో వెళ్లిన మాట వాస్తవమే. వారందరూ అక్కడకు వెళ్లి మద్యం తాగి తిరిగి వస్తుండగా మున్నా అనే వ్యక్తి ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. విధి నిర్వహణలో క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమైన పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. 
–ప్రభాకర్‌రావు, సీఐ, పిడుగురాళ్ల 

మరిన్ని వార్తలు