మంచినీళ్లు అడిగితే పురుగుల మందు ఇచ్చారు!

12 Jun, 2022 01:40 IST|Sakshi
శివ 

యువతి కోసం వెళ్లిన ప్రియుడిపై బంధువుల దాడి

చికిత్స పొందుతూ నిమ్స్‌లో మృతి

కేసు పెట్టేందుకు వెళ్లిన బాధితుడిని బెదిరించిన పోలీసులు!

నాగర్‌కర్నూల్‌ రూరల్‌/తెలకపల్లి: ప్రియురాలి కోసం వచ్చిన యువకుడిని పట్టుకుని ఎందుకొచ్చావంటూ నిలదీసి దాడి చేశారు. దీంతో అక్కడ్నుంచి దెబ్బలతో వచ్చిన యువకుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చగా పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించగా.. ప్రణాళిక ప్రకారమే తమ కొడుకును చంపేశారని తలిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈనెల 5న జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లిలోని దాదామోని శివ(18) కొంతకాలంగా అచ్చంపేట మండలం చవుట పల్లికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. కాగా, ఈనెల 5న తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లిలోని చిన్నమ్మ ఇంటికి ప్రియురాలు వెళ్లింది. ప్రియురాలి కోసం శివ అదే రాత్రి ఇంటికి వెళ్లాడు.దీంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ‘మా అమ్మాయి వద్దకు మళ్లీ ఎందుకొచ్చా వు..’ అంటూ దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయ పడి శివ అక్కడ్నుంచి ఇంటికి రాగా అతడి కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌ లోని జనరల్‌ ఆస్పత్రికి తరలిం చారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసు కెళ్లారు. అక్కడే చికిత్స పొందు తూ ఈనెల 9న మృతి చెందాడు. ఈ ఘటనపై శనివారం అతని తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు
శివను పథకం ప్రకారమే ప్రియురాలి బంధువులు హత్య చేశారని యువకుడి తల్లిదండ్రులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంతటి నాగన్న, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్‌ ఆరోపించారు. న్యాయం చేయాలని తెలకపల్లి పోలీసులను ఆశ్రయించిన యువకుడి తల్లిదండ్రులను అక్కడి ఎస్‌ఐ బెదిరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ఎస్పీ మనోహర్‌కు ఫిర్యాదు చేశారు.

దాడి చేశారని కేసు పెట్టేందుకు వెళ్లిన శివపైనే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానని ఎస్‌ఐ బెదిరించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడిలో దెబ్బలకు తాళలేక మంచినీళ్లు ఇవ్వాలని కోరిన శివకు ప్రియురాలి బంధువులు పురుగుమందు తాగించారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకుడు పృథ్వీరాజ్, జనసేన యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగా లక్ష్మణ్‌గౌడ్, శివ కుటుంబ సభ్యులు, తెలకపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు