ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయని.. యువకుడు మృతి

5 Nov, 2022 09:54 IST|Sakshi

సాక్షి, నల్గొండ: తాను అభిమానించిన నాయకుడు ఓడిపోతాడని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడంతో ఆ యువకుడు వేదనకు గురయ్యాడు. అదే ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల్‌లోని రాంనగర్‌ కాలనీకి చెందిన ఊదరి శంకర్‌ (30) సెంట్రింగ్‌ పని చేస్తుంటాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో కొంత కాలంగా విద్యానగర్‌ కాలనీలో సోదరి వద్ద ఉంటున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నెల రోజులుగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రచారం నిర్వహించాడు.

పోలింగ్‌ ముగిసిన తర్వాత టీవీలు, సోషల్‌ మీడియాలో వచ్చిన ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలతో ఆందోళనకు గురయ్యాడు. గురువారం రాత్రి 9 గంటల వరకు తన మిత్రులతో మాట్లాడి ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఊరి నుంచి వచ్చిన అక్కాబావలు తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పక్కింటి వారి సాయంతో తలుపు తెరిచి చూడగా శంకర్‌ చనిపోయి ఉన్నాడు.

ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధిస్తారని చాలా ధీమాతో ఉన్న సమయంలో ఎగ్జిట్‌పోల్స్‌ అందుకు విరుద్ధంగా రావడాన్ని తట్టుకోలేక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.  కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్‌ తెలిపారు.
చదవండి: మునుగోడుపై టీఆర్‌ఎస్‌ పోస్ట్‌మార్టం.. ఆ నివేదికలో ఏముంది?

మరిన్ని వార్తలు