అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ 

29 Sep, 2022 07:13 IST|Sakshi

ఈవెంట్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదం  

యువకుడి దుర్మరణం 

ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో తొక్కిసలాట 

గాయపడ్డ యువతి 

గార్లదిన్నె(అనంతపురం జిల్లా): అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాలు.. గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్‌(23), అభిరామ్‌ స్నేహితులు. వీరికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం.
చదవండి: కేబుల్‌ బ్రిడ్డి వద్ద టెన్షన్‌.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య!

దీంతో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న గాడ్‌ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమానికి బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కుక్క అడ్డు రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డారు. రాజశేఖర్‌ అక్కడికక్కడే   మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ అభిరామ్‌ను స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

తొక్కిసలాటలో గాయపడ్డ యువతి 
అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: స్థానిక ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన గాడ్‌ఫాదర్‌ ఈవెంట్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా అభిమానులు తరలిరావడంతో మైదానం కిక్కిరిసింది. అభిమాన హీరోని చూడాలనే ఆత్రుత కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో అనంతపురంలోని రహమత్‌నగర్‌కు చెందిన అఖిల అనే యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.     

మరిన్ని వార్తలు