ఆత్మహత్యాయత్నం: కాళ్లు పోయాయి.. ప్రాణాలు మిగిలాయి

13 Jul, 2021 09:45 IST|Sakshi

సాక్షి, గుంటూరు (తాడేపల్లి రూరల్‌): నిండా ఇరవై ఏళ్లు కూడా పూర్తికాని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు. పట్టాలపై ఉన్న యువకుడిని గుర్తించిన లోకో పైలట్లు షడన్‌ బ్రేక్‌ వేసి రైలు ఆపారు. అయినప్పటికీ యువకుడి రెండు కాళ్లూ తెగిపోయాయి. గాయపడిన యువకుడిని లోకోపైలట్లు అదే ట్రైన్‌లో విజయవాడ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే.... ట్రైన్‌ నెం. 7222 (లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌) సోమవారం గుంటూరు వైపు నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్‌కు వస్తున్న సమయంలో కృష్ణాకెనాల్‌ జంక్షన్‌కు అరకిలోమీటరు దూరంలో ఓ యువకుడు రైలు పట్టాలమీద పడుకున్నాడు. దూరం నుంచి గమనించిన లోకోపైలట్లు హనుమంతరావు, రఘురామరాజు ట్రైన్‌ షడన్‌ బ్రేక్‌ అప్లయ్‌ చేశారు.

సైరన్‌ కొడుతున్నప్పటికీ అతను ట్రాక్‌ పైనుంచి లేవలేదు. ట్రైన్‌ ముందు భాగంలోని సేఫ్టీ గ్రిల్‌ యువకుడ్ని పక్కకు నెట్టేసింది. యువకుడు పట్టాల పక్కకు రాగా, రెండుకాళ్లూ చక్రాల కిందపడి తెగిపోయాయి. వెంటనే లోకో పైలట్లు ట్రైన్‌ ఆపి యువకుడ్ని ఇంజన్‌ వెనుక పెట్టెలో ఎక్కించుకుని విజయవాడ తీసుకువెళ్లారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో విజయవాడ స్టేషన్‌లో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెగిపోయిన కాళ్లను కలిపేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు కాళ్లూ తొలగించారు. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు నులకపేటకు చెందిన పృధ్విగా తెలిసింది.

మరిన్ని వార్తలు