పరువు హత్య: తమ సోదరిని మరచిపోవాలని గట్టి వార్నింగ్‌.. అయినా వినకపోవడంతో

7 Jul, 2022 11:03 IST|Sakshi
చంద్రకాంత్‌(ఫైల్‌)

రాయచూరు రూరల్‌: తమ సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువతి సోదరులు పరువు హత్యకు పాల్పడిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. అఫ్జల్‌పుర తాలూకా దేవల గాణగాపురలోని ఓ లాడ్జిలో విధులు నిర్వహిస్తున్న చంద్రకాంత్‌(24)కు అదే ఊరులో డిగ్రీ చదువుతున్న జేవర్గి తాలూకా హుల్లూరుకు చెందిన అమ్మాయితో పరిచయమైంది.

ఆరు నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇటీవల ఇళ్లు వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అమ్మాయి పెద్దలు వారి ఆచూకీని కనుగొని ఈ నెల 3న బెంగళూరు నుంచి పిలుచుకొచ్చారు. ఆ తర్వాత తన సోదరి అంటే ఇష్టం లేదని చెప్పాలని ఆమె సోదరులు ఈరప్ప, హులిగప్ప, రాకేష్‌లు చంద్రకాంత్‌పై శతవిధాలుగా ఒత్తిడి తెచ్చారు.

చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..)

అందుకు చంద్రకాంత్‌ ససేమిరా అనడంతో అతనిని అంతమొందించాలని ప్రణాళిక రచించారు. ఈక్రమంలో మంగళవారం రాత్రి అతనిని లాడ్జిలోనే నిర్బంధించి క్రిమిసంహారక మందును తాపించి గొంతు నులిమి చంపి సమీపంలోని ఇంగళిగి వద్ద పొలంలో మృతదేహాన్ని పడేశారు. సమాచారం అందుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనపరచుకున్న దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.   

చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు)

మరిన్ని వార్తలు