ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి.. రూ.95 లక్షలు ఓడి

21 Dec, 2022 02:45 IST|Sakshi
బాధితుడు  హర్షవర్ధన్‌రెడ్డి   

భూ పరిహారం సొమ్ముతో యువకుడి ఆట

షాబాద్‌: తల్లిదండ్రులకు తెలియకుండా నష్టపరిహారం కింద వచ్చిన రూ.95 లక్షలతో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడి పోగొట్టుకున్నాడు ఒక యువకుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం సీతారాంపూర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గురువయ్యగౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. షాబాద్‌ మండలం సీతారాంపూర్‌ గ్రామానికి చెందిన చన్‌వల్లి శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

గ్రామంలో శ్రీనివాస్‌రెడ్డి కౌలు చేస్తున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం తన అవసరాల కోసం తీసుకొని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఈ డబ్బుతో శంషాబాద్‌ మండలం మల్లాపూర్‌ వద్ద భూమి కొనేందుకు శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల్లో భూ లావాదేవీలు జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ ఖాతాలో ఉన్న డబ్బును కుమారుడి ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ క్రమంలో హర్షవర్ధన్‌రెడ్డి కింగ్‌ 567 అనే ఆన్‌లైన్‌ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడాడు.. తన ఖాతాలోని రూ.95 లక్షలు పోగొట్టుకున్నా­డు. విషయం తెలుసుకున్న సోదరుడు శ్రీపాల్‌రెడ్డి, కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సైబర్‌క్రైమ్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు