విహార యాత్రలో విషాదం..

24 Jul, 2021 21:06 IST|Sakshi
స్నేహితులతో కలసి దిగిన సెల్ఫిలో బిలాల్‌(షార్ట్‌ వేసుకున్న యువకుడు) (ఇన్‌సెట్‌) బిలాల్‌

కమలాపురం/ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): స్నేహితులతో కలిసి సరదాగా సేదతీరేందుకు వచ్చి యువకుడు సముద్రంలో గల్లంతయిన సంఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వైఎస్సార్‌ జిల్లా కమలాపురం టౌన్‌కు చెందిన సయ్యద్‌ బిలాల్‌ (20) స్నేహితులతో కలిసి విహార యాత్ర కోసం మైపాడు బీచ్‌కు వచ్చారు. అందరూ కలసి సంతోషంగా సముద్రంలో నీటిలో దిగి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అలల ఉధృతి ఎక్కువై సయ్యద్‌ బిలాల్‌ నీటిలో కొట్టుకుపోయాడు.

తీరం వెంబడి ఎంత వెతికినా ఇతని జాడ తెలియలేదు. అంతవరకు కళ్ల ఎదుటే ఉన్న స్నేహితుడు గల్లంతవడంతో వెంట వచ్చిన మిత్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎస్సై నరేష్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పండుగ మరుసటిరోజే.. కమలాపురం పట్టణంలోని దర్గా వీధికి చెందిన బాషామోదీన్, గౌసియా దంపతులకు ఏకైక కుమారుడు బిలాల్‌. ఇద్దరు కుమార్తెల అనంతరం పుట్టడంతో గారాబంగా పెంచుకున్నారు. తండ్రి హోటల్‌ కార్మికుడిగా పని చేస్తున్నాడు.

తండ్రికి తోడుగా ఉండాలని ఇటీవల బిలాల్‌ కూడా స్కూటర్‌ మెకానిక్‌ షెడ్డుకు వెళ్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు దూరమయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.ముందు రోజు బక్రీద్‌ పండుగను బిలాల్‌ ఆనందంగా జరుపుకున్నాడు.ఆ ఆనందం అంతలోనే అవిరైంది. రెండేళ్ల క్రితం బక్రీద్‌ పండుగ అనంతరం ఇదే వీధికి చెందిన ముగ్గురు చిన్నారులు, ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువక ముందే బిలాల్‌ గల్లంతు కావడం ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది.

మరిన్ని వార్తలు