ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

25 Sep, 2021 02:08 IST|Sakshi
వినయ్‌రెడ్డి(ఫైల్‌) 

రామగిరి(నల్లగొండ): ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేరెడ్డి శేఖర్‌రెడ్డి చిన్న కుమారుడు మేరెడ్డి వినయ్‌రెడ్డి(24) బీటెక్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేసే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన లహరితో పరిచయం పెంచుకున్నాడు.

ఆ క్రమంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వీరిద్దరు వివాహం చేసు కుందామనుకున్నారు. అయితే లహరి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు బలవంతం గా వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కారణంతో లహరి ప్రియుడి వద్దకు వచ్చేసింది. వీరిద్దరూ కలసి బెంగళూరు వెళ్లిపోయారు. వీరి ఆచూకీ తెలుసుకున్న లహరి కుటుంబసభ్యులు వినయ్‌రెడ్డిపై దాడిచేసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో వినయ్‌రెడ్డి బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్తాపం చెందిన వినయ్‌ గురువారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు