వారం రోజుల్లో విదేశాలకు.. కారం, కత్తి, ఐరన్‌ రాడ్‌తో కొట్టి..

24 Jan, 2022 11:50 IST|Sakshi

సాక్షి, గాజువాక (విశాఖ): గాజువాకలోని గోపాలరెడ్డినగర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తీర్చలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిని కిరాతకంగా హతమార్చారు. కారం, కత్తి, ఐరన్‌ రాడ్‌తో కొట్టి హత్య చేశారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... గోపాలరెడ్డినగర్‌కు చెందిన ఛత్రబోయిన ప్రసాద్‌ (32) సింగపూర్‌లో వెల్డర్‌గా పని చేసి వచ్చాడు. మరో వారం రోజుల్లో మస్కట్‌కు వెళ్లేందుకు వీసా సంపాదించాడు.

కాగా, సమీప బంధువులైన శ్రీను, చిన్న, పోతురాజు వద్ద కొద్దికాలం క్రితం రూ.80వేలు అప్పుగా తీసుకున్నాడు. తమ అప్పు తిరిగి చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరిగి చెల్లించేస్తానని ప్రసాద్‌ అంగీకరించాడు. అయితే ఇప్పటి వరకు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రసాద్‌ మళ్లీ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న విషయం తెలుసుకొని శ్రీను, చిన్న, పోతురాజు మరింత ఒత్తిడి పెంచారు.

చదవండి: (ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..)

ఆదివారం సాయంత్రం తమ కాలనీ సమీపంలో జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లిన ప్రసాద్‌ను ముగ్గురు వ్యక్తులు కారం, కత్తి, ఐరాన్‌ రాడ్‌తో హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. నిందితులు ముగ్గురు మృతునికి దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్య చేసిన వెంటనే నిందితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్టు సమాచారం. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. సోదరుడు కూడా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఏడీసీపీ రాజ్‌కమల్‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

చదవండి: (వాట్సాప్‌ మెసేజ్‌: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..)

మరిన్ని వార్తలు