పోలీసులు అక్రమ కేసు బనాయించారని..

27 Jul, 2020 11:43 IST|Sakshi
మునగాల: సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి నిరసన

మునగాల మండల కేంద్రంలో ఘటన

మునగాల (కోదాడ): పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనపై అక్రమ కేసు బనాయించారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. నర్సింహాపురం గ్రామానికి చెందిన బారి వేణు కుటుంబానికి,  బంధువులకు సంబంధించి గతంలో భూ వివాదం నెలకొన్నది. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో బారి సంధ్య అనే యువతి వేణు కుంబసభ్యులపై  మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

దీంతో స్థానిక ఎస్‌ఐ బారి వేణు, తండ్రి లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు. తమపై సంధ్య ఆమె అనుచరులే దాడి చేశారని వేణు ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్‌ఐ పట్టించుకోకుండా తమపై అక్రమ కేసు బనాయించారని, తనకు న్యాయం చేయాలంటూ వేణు పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కాడు. విషయం తెలుసుకున్న మునగాల ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్, సీఐ శివశంకర్‌గౌడ్‌ సెల్‌టవర్‌ వద్దకు చేరుకున్నారు. భూ వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఫోన్‌ ద్వార బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతం అయింది.  

మరిన్ని వార్తలు